పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులను మరోసారి నిరాశ పర్చబోతున్నాడట. ఇదే టైమ్‌ని ఎన్టీఆర్‌ క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నాడట. పవన్‌ స్థానంలో తాను రావాలనుకుంటున్నాడని టాక్‌.  

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటారని సమాచారం. దాని ప్రకారమే ఆయన నటించాల్సిన మూడు సినిమాల షూటింగ్‌లు ప్లాన్‌ చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల్లో పవన్‌ గెలిస్తే ఓ లెక్క, ఓడిపోతే మరో లెక్క. ఏం జరిగినా, ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శక, నిర్మాతల్లో గుబులు లాంటి వాతావరణం ఉంది. ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అయితే అందరిలోనూ నెలకొంది. 

ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆయన్నుంచి రావాల్సిన మూవీ ఈ ఏడాది రావడం లేదని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న మూడు సినిమాల్లో అత్యంత హైప్‌ ఉన్న మూవీ `ఓజీ`. ముంబయి మాఫియా ప్రధానంగా సాగే మూవీ ఇది. సుజీత్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యింది. ఓ 15, 20రోజులు పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ ఇస్తే షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్‌ 27న విడుదల అవుతుంది. 

కానీ లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఈ ఏడాది రావడం లేదట. ఈ మూవీ బిజినెస్‌ కాలేదని అంటున్నారు. నిర్మాత పరంగా సమస్యలు, అలాగే పవన్‌ కూడా ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొంటాడా అనేది సస్పెన్స్ గా మారింది. ఇలా అనేక టెక్నీకల్‌ కారణాలతో ఈ మూవీ ఇప్పట్లో ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం, ఈ ఏడాది రిలీజ్‌ చేయడం కష్టమే అంటున్నారు. అయితే ఈ సమాచారం ఆల్‌రెడీ ఇతర నిర్మాతలకు చేరిపోయిందట. అందుకే `ఓజీ` రావాల్సిన డేట్‌కి వేరే సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న `లక్కీ భాస్కర్‌` రిలీజ్‌ డేట్‌ని సేమ్‌ డేట్‌కి ప్రకటించారు. ఇదే పవన్‌ `ఓజీ` రావడం లేదనే విషయాన్ని కన్ఫమ్‌ చేస్తుంది. 

మరోవైపు సెప్టెంబర్‌ 27ని ఎన్టీఆర్‌ కూడా టార్గెట్‌ చేస్తున్నారు. పవన్‌ స్థానంలో తాను రావాలనుకుంటున్నాడట. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్‌ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. దీన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 10 న విడుదల చేయాలని డేట్‌ని ప్రకటించారు. అయితే పవన్‌ `ఓజీ` తప్పుకుంటే అదే డేట్‌కి ఎన్టీఆర్‌ `దేవర`ని తీసుకురావాలనుకుంటున్నారట. దీనిపై కసరత్తు నడుస్తుందని, మరో వారం, పది రోజుల్లో క్లారిటీ రానుందని తెలుస్తుంది. మొత్తంగా ఈ వార్తలు చూస్తుంటే పవన్‌ ఈ ఏడాది రావడం లేదని అంటున్నారు. ఇది నిజంగానే పవర్‌ స్టార్‌ అభిమానులను నిరాశ పరిచే వార్త అనే చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే మరో సర్‌ప్రైజ్‌ తీసుకురాబోతున్నారు. `ఓజీ` స్థానంలో `హరిహర వీరమల్లు`ని తీసుకురావాలని అనుకుంటున్నారట. పవన్‌ ఎన్నికల ఫలితాల అనంతరం `ఓజీ` షూటింగ్‌లో కాకుండా `హరిహర వీరమల్లు` షూటింగ్‌లో పాల్గొంటాడట. ఆ మూవీని శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా టీమ్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం లొకేషన్లకి సంబంధించిన రెక్కీ నడుస్తుందని, త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ చేస్తామని టీమ్‌ వెల్లడించింది. మొదట ఈ మూవీని పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. క్రిష్‌ స్థానంలో జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. క్రిష్‌ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఏఎం రత్నం ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విసయం తెలిసిందే. పవన్‌ నుంచి రాబోతున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.