టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు ఎక్కువగా ఒకే సినిమాపైనే ఉంది. అదే ఎన్టీఆర్ బయోపిక్. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగు మహానటుడు జీవితం రెండు భాగాలుగా విడుదలకానుంది. మొదటి పార్ట్ కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఇటీవల షూటింగ్ పనులన్నిటినీ ముగించుకుంది. ట్రైలర్ కూడా కట్ చేసి రెడీగా ఉంచారు. 

మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో ట్రైలర్ లాంచ్ ను ఘనంగా నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కథానాయకుడు సినిమా కాబట్టి కేవలం ఎన్టీఆర్ సినీ కెరీర్ కు సంబందించిన షాట్స్ ఉంటాయట. రాజకీయాలకు ఈ ట్రైలర్ లో ఏ మాత్రం తావివ్వలేదని తెలుస్తోంది. అలాగే ఫస్ట్ పార్ట్ లో కూడా రాజకీయ ఆనవాళ్లు పెద్దగా కనిపించవని చిత్ర యూనిట్ నుంచి టాక్ వినిపిస్తోంది. 

ఎక్కువగా ట్రైలర్ లో ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన బాలకృష్ణ వివిధ రకాల్లో డైలాగ్స్ చెబుతూ హావభావాలతో అలరిస్తారని సమాచారం. చిన్ననాటి షాట్స్ కూడా అక్కడక్కడా టచ్ చేశారట. ఇక కీరవాణి ట్రైలర్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుందని ఇన్ సైడ్ టాక్. మరి మొత్తంగా ట్రైలర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సాయి కొర్రపాటి - బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.