తమ చిత్రాలని డబ్ చేసి ఇతరభాషల్లోకి రిలీజ్ చేయడంలో తమిళ స్టార్స్ ముందుంటారు. చాలామంది తమిళ హీరోలకు తెలుగులో మార్కెట్ ఉంది. కానీ తెలుగు హీరోలు ఒకరిద్దరికి తప్పితే మిగిలిన వారికి ఇతర భాషల్లో మార్కెట్ లేదు. దీనిని అధికమించడానికి బాహుబలి తర్వాత టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు మేల్కొన్నారు. 

హిందీతో పాటు సౌత్ అన్ని భాషల్లో తమ చిత్రాలని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక రకంగా రాజమౌళి ఇచ్చిన ధైర్యం అని చెప్పొచ్చు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ మూడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 

యమదొంగ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పౌరాణిక గెటప్ లో అదరగొట్టాడు. చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్లడం.. అక్కడ యముడిని ఒక ఆట ఆడుకోవడం లాంటి సన్నివేశాలతో యమదొంగ చిత్రం గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రం విడుదలై 12 ఏళ్ళు గడిచిపోతోంది. 

దాదాపు 12 ఏళ్ల తర్వాత యమదొంగ చిత్రాన్ని తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఒక రకంగా దీనికి కారణం రాజమౌళి అనే చెప్పొచ్చు. బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ విశ్వవ్యాప్తమైంది. రాజమౌళి చిత్రాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. 

రాజమౌళి క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో యమదొంగ చిత్రాన్ని 'విజయన్' గా రిలీజ్ చేయబోతున్నారు. సుదీక్ష ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. ప్రముఖ రచయిత ఏఆర్కె రాజరాజా ఈ చిత్రానికి తమిళంలో మాటలు రాశారు.