ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. దీంతోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు ఎన్టీఆర్‌. `అరవింద సమేత` తర్వాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని ఇటీవల నిర్మాతలు హింట్‌ ఇచ్చారు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ, కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాని నిర్మించనున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమాలో హీరోయిన్‌ విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. పూజాహెగ్డే, రష్మీకా మందన్నా పేర్లు వినిపించాయి. అంతేకాదు కియారాని కూడా పరిశీలిస్తున్నారని, అలాగే జాన్వీ కపూర్‌ తో చర్చ జరుగుతుందని ఇలా రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో కొత్త హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మని తీసుకురాబోతున్నారట. హిందీలో `లవ్‌రాత్రి` చిత్రంతో హీరోయిన్‌గా మారిన వరిన హుస్సేన్‌ అనే అప్‌కమింగ్‌ బ్యూటీని తెలుగులో పరిచయం చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. ఆమెతో చర్చలు జరిగాయని, దాదాపు ఓకే అయ్యిందనే టాక్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 

అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్‌ ఉందని, మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుందని, సెకండ్‌ హీరోయిన్‌గా వరిన హుస్సేన్‌ని తీసుకుంటున్నారని టాక్‌. ఇటీవల త్రివిక్రమ్‌ తన సినిమాల్లో వరుసగా పూజాని రిపీట్‌ చేస్తున్నాడు. `అరవింద సమేత`, గతేడాది వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ `అలావైకుంఠపురములో` పూజానే హీరోయిన్‌. ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. అదే సెంటిమెంట్‌ని ఎన్టీఆర్‌ చిత్రానికి కూడా వర్కౌట్‌ చేయించాలని భావిస్తున్నట్టు టాక్‌. ఇక ఈ సినిమాకి `అయినను పోయిరావలే హస్తినకు` అనే టైటిల్‌ వినిపించింది. దీనిపై ఇంకా క్లారిటీ లేదు.