వరుసగా రెండో ఏడాది కూడా జూనియర్ ఎన్టీఆర్ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా విజృంభణ ప్రజల ప్రాణాలపై యమపాశం విసురుతుంటే రోజుకు వేలల్లో అసువులు బాస్తున్నారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికర పరిస్థితి నెలకొంది. ఇలాంటి చీకటి సమయంలో తన బర్త్ డే వేడుకలు నిర్వహించరాదని జూనియర్ ఎన్టీఆర్ సుదీర్ఘ సందేశం ద్వారా ఫ్యాన్స్ ని వేడుకున్నాడు. 

'నా అభిమానులందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతకొంత కాలంగా మీరు పంపుతున్న వీడియోలు, సందేశాలు నేను చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరటనిచ్చాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. 


ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకొని కోవిడ్ ని జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటిపట్టునే ఉంటూ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. 


ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తుంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్స్, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో ప్రాణాలను , తమ జీవనోపాధిని కోల్పోయారు. కుదిరితే వారికి అండగా నిలబడాలి.


మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయడం. 


త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆరోజు అందరం కలిసి పండగ చేసుకుందాం. అప్పటి వరకు మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆసిస్తూ మీ ఎన్టీఆర్.... ' అంటూ సుదీర్ఘ సందేశాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు ఎన్టీఆర్. 


మరో వైపు ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా కొన్ని కీలక అప్డేట్స్ రానున్నట్లు సమాచారం అందుతుంది. కొరటాలతో చేస్తున్న మూవీపై ఓ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై అధికారిక ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతుంది.