2022 సంక్రాంతి అతిపెద్ద యుద్దానికి తెరలేపే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య ఎపిక్ పోరు తప్పేలా లేదు. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లతో పాటు పవన్ కళ్యాణ్ మధ్య భారీ బాక్సాఫీస్ వార్ జరగడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న కొన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో దిగేలా ఉన్నాయి. ఈ నలుగురిలో మహేష్ ఇప్పటికే సంక్రాంతి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. దుబాయిలో ఇటీవల సర్కారు వారి పాట షూటింగ్ మొదలుకాగా... జనవరి 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఆ తరువాత ప్రభాస్-ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ విడుదల కూడా సంక్రాంతికి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రెండు రోజుల క్రితం సలార్ షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి ఖనిలో ప్రారంభమైంది. ఈ మూవీని విడుదల కూడా 2022 సంక్రాంతికి ఉండే అవకాశం కలదు. 

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే అనుకున్న సమయం కంటే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ లేటైంది. దీనితో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, సినిమా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. 

కెరీర్ లో మొదటిసారి పవన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని కూడా దర్శకుడు క్రిష్ సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట. మరి ఇదే జరిగితే దశాబ్దాల తరువాత టాప్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచినట్లు అవుతుంది. అప్పుడెప్పుడో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సంక్రాంతి రేసులో పోటీపడ్డారు. 2000 సంక్రాంతికి దేవిపుత్రుడు, నరసింహనాయుడు, మృగరాజు విడుదలయ్యాయి.