నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల జీవితంలో ఓ దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల జీవితంలో ఓ దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తము ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయి ఇద్దరు అన్నదమ్ములు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం నాడు తెల్లవారుజామున కారు యాక్సిడెంట్ లో హరికృష్ణ చనిపోయారు. ఈ బాధ నుండి బయటకి వచ్చి తిరిగి షూటింగ్ లలో పాల్గొనడానికి ఇద్దరు అన్నదమ్ములకు కొంత సమయం పడుతుందని అంతా భావించారు.
కానీ తమ బాధ కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రేపటినుండి వీరిద్దరూ తమ సినిమాల షూటింగ్ లలో పాల్గొనున్నారని సమాచారం. హరికృష్ణ పెద్దకర్మ వరకు బ్రేక్ తీసుకోకుండా రేపటినుండి పని చేయనున్నారని తెలుస్తోంది. దివంగత నందమూరి తారకరామారావు కూడా ఇదే విషయాన్ని చెప్పేవారట. మన ఇంట్లో సమస్యలు, పండగల కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వకూడదని సీనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెబుతుండేవారట.
ఇప్పుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కూడా అదే బాటలో నడవనున్నారని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఎన్టీఆర్ 'అరవింద సమేత' కోసం, కళ్యాణ్ రామ్ దర్శకుడు గుల్హన్ సినిమా కోసం సిద్ధమవుతున్నారని సమాచారం. తండ్రి లేడనే బాధను దిగమింగుకొని ఇద్దరూ షూటింగ్ కి రెడీ అవుతుండడం పలువురిని భావోద్వేగానికి గురి చేస్తోంది.
