బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనకున్న సినిమాల కమిట్మెంట్స్ కారణంగా సీజన్ 2 కు వ్యాఖ్యాతగా వ్యవహరించలేకపోతున్నాడు. దీంతో ఆయన స్థానంలోకి నేచురల్ స్టార్ నాని వచ్చి చేరాడు. తన వాక్చాతుర్యంతో నాని ఈ షోని రసవత్తరంగా నడిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఈ షోలో పోటీదారులుగా ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారనే విషయంలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

తెలుగమ్మాయి తేజస్వి మదివాడ, సింగర్ గీతామాధురి,అలానే ఒకప్పటి హీరో లవర్ బాయ్ తరుణ్ లను పోటీదారులుగా ఎంపిక చేసుకున్నారు. తరుణ్ పేరు గతంలో కొన్ని వివాదాల్లో వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు ట్రాన్స్ జెండర్ శ్యామల ను కూడా ఈ షోలో పాల్గొనబోతుంది. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఎన్టీఅర్ నటించిన 'స్టూడెంట్ నెం1' సినిమాలో హీరోయిన్ గా నటించిన గజాలాను బిగ్ బాస్ షో కోసం సెలెక్ట్ చేశారని సమాచారం. సినిమాలలో నటించే సమయంలోనే గజాలా పెద్దగా పాపులర్ అవ్వలేదు.అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా ఆమెను తీసుకోవడం చర్చకు దారితీస్తుంది. మరి ఈ షోతో అయినా.. గజాలాకు క్రేజ్ వస్తుందేమో చూడాలి!