నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి  నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా ఈ  బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్‌. ఆదివారం తొలి పాటను రిలీజ్ చేశారు.

‘ఘన కీర్తిసాంధ్ర.. విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్రా..’ అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.  మూడు నిముషాల ముప్పై సెనక్ల పాటు సాగిన ఈ పాట ఎన్టీఆర్ సినిమాను, గుణగణాలను కళ్లకు కట్టినట్టు వర్ణించింది. 

రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్‌ ఈ గీతాన్ని ఆలపించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్‌ కానుంది.