సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్టీఆర్,బాలకృష్ణ, రామ్ చరణ్, మోహన్ బాబు గౌతమ్ రాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎడిటర్ గా గౌతమ్ రాజు సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్నారు. కెరీర్ లో వందల చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు.68ఏళ్ల గౌతమ్ రాజు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి మరణించినట్లు సమాచారం. గౌతమ్ రాజు మృతి వార్త టాలీవుడ్ ని విషాదంలో ముంచింది. పరిశ్రమలో ఉన్న ప్రతి హీరోతో ఆయన పనిచేశారు. దీంతో చిత్ర ప్రముఖులు ఒక్కొక్కరిగా సంతాపం ప్రకటిస్తున్నారు. దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ (NTR)ట్విట్టర్ వేదికగా గౌతమ్ రాజు మృతిపై స్పందించారు. సుమారు 850 చిత్రాలకు ఎడిటర్ గా పని చేసి తెలుగు సినిమా ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకత సాధించిన గౌతమ్ రాజు అకాల మరణం బాధాకరం. నేను నటించిన అనేక చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అని ట్వీట్ చేశారు.
అలాగే రామ్ చరణ్(Ram Charan) గౌతమ్ రాజు మృతిపై స్పందించారు. గౌతమ్ రాజు మరణం పరిశ్రమకు తీరని లోటు. మీ వర్క్ ఓ గొప్ప నిధిలా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భగవంతుడు మనో ధైర్యం ప్రసాదించాలి... అంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం గౌతమ్ రాజు మరణంపై ట్వీట్ చేశారు.
గౌతమ్ రాజు (Gowtham Raju)నాకు అత్యంత ఆప్తుడు. నా సొంత బ్యానర్ లో తెరకెక్కిన అనేక చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన పిల్లలు మన విద్యాసంస్థలలో చదువుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. కానీ అతని మరణం కలచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
ఇక ఫేస్ వేదికగా బాలకృష్ణ స్పందించారు. గౌతమ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఎడిటర్ గౌతమ్ రాజు గారి మరణం చాలా బాధాకరం. గౌతమ్ రాజు అద్భుతమైన ప్రతిభ గల ఎడిటర్.నాకెంతో ఆత్మీయుడు, మృదు స్వభావి.అనేక విజయవంతమైన సినిమాలకు కలసి పని చేశాం. ఎడిటర్ గా గౌతమ్ రాజు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను... అంటూ సందేశం పోస్ట్ చేశారు.
