ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయాల్సి ఉంది. గతేడాది ఈ సినిమాని ప్రకటించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించనున్నారు. దీనికి సూర్య దేవర నాగవంశీ సమర్పకులు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని అంతా భావించారు. ఇటీవల త్రివిక్రమ్‌ కరోనాకి గురయ్యారు. ఇప్పుడే ఆయన కోలుకున్నారు. వెంటనే ఎన్టీఆర్‌ సినిమాని పట్టాలెక్కిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా బిగ్‌ షాక్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నట్టు ప్రకటించారు. 

దీంతో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ అభిమానులకే కాదు చిత్ర వర్గాలు సైతం ఆశ్చర్యానికి, షాక్‌కి గురవుతున్నారు. త్రివిక్రమ్‌ సినిమాకి సంబంధించిన ప్రకటన వస్తుందని భావించిన నేపథ్యంలో ఆ స్థానంలో మరో సినిమా రావడం ఊహకందని విధంగా ఉంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమా చేయడం లేదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఊహించని పరిస్థితుల కారణంగా ఈ సినిమా చేయడం లేదు. కానీ ఎన్టీఆర్‌ అన్నతో చేయాలనే ఎగ్జైట్‌మెంట్‌ అలానే ఉంది. భవిష్యత్‌లో ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఆశిస్తున్నాం` అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.