ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం టెంపర్. వీరిద్దరూ కలిసి చేసిన మొదటి చిత్రం ఆంధ్రావాలా డిజాస్టర్ గా నిలిచింది. సింహాద్రి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి జోరుమీదున్న ఎన్టీఆర్ కి ఆంధ్రావాలా రూపంలో పెద్ద షాకే తగిలింది. ఆంధ్రావాలా మూవీ విడుదలైన  పదకొండేళ్లకు ఎన్టీఆర్-పూరి మరలా టెంపర్ చేశారు. టెంపర్ సమయానికి ఇద్దరూ ప్లాప్స్ లో ఉన్నారు. టెంపర్ కి ముందు ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య, రభస  ప్లాప్స్ గా నిలిచాయి.

ఇక పూరి సైతం మహేష్ బిజినెస్ మ్యాన్ తరువాత వరుసగా ఐదు ప్లాపులు ఇచ్చారు. ఆ సమయంలో పూరిని నమ్మిన ఎన్టీఆర్ టెంపర్ చేయడం జరిగింది. అది కూడా కరెప్టెడ్ పోలీస్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ టెంపర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎన్టీఆర్ ని మోనాటమి నుండి బయటపడేసిన చిత్రంగా టెంపర్ నిలిచింది.

పూరి మార్క్ డైలాగ్స్, నెగిటివ్ మేనరిజం తెరపై అద్భుతంగా పండించాడు ఎన్టీఆర్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్, అనూప్ రూబెన్స్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మణిశర్మ బిజీమ్ సినిమా స్థాయిని పెంచింది. సినిమాలో కీలక పాత్రలు చేసిన పోసాని, ప్రకాష్ రాజ్ సహజ నటనతో మెప్పించారు. కాగా టెంపర్ విడుదలై నేటికి 6ఏళ్ళు పూర్తి అయ్యింది. 2015 ఫిబ్రవరి 13న విడుదలైన టెంపర్ ఎన్టీఆర్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది. టెంపర్ తరువాత ఎన్టీఆర్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్ కావడం విశేషం.