అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' .. సంక్రాంతి బరిలో సూపర్ హిట్ టాక్ తో  సందడి చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో లైవ్ ఇచ్చినా ఇంకా  చాలా చోట్ల తన హంగామాని కొనసాగిస్తూనే వుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ప్రాంతాల్లో పాత రికార్డులను తిరగరాస్తూ వెళుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ ల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించారు. ఒక వేదికపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ 'ఎఫ్ 3' ఉంటుందని అన్నాడు. అలాగే వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోనే 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రానుందని సమాచారం. అయితే కొత్త మార్పు ఏంటంటే ఈ ఇద్దరికీ  మరో హీరో తోడు కానున్నాడని చెప్పుకున్నారు.

ఆ హీరో మరెవరో కాదు రవితేజ అని చెప్పుకున్నారు. 'రాజా ది గ్రేట్' తరహాలోనే ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ పాత్రలో నితిన్ ని సీన్ లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడని వినికిడి. తమ బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం అనే డిజాస్టర్ ని నితిన్ కు ఇచ్చామని.. దాంతో ఓ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.  త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.