నటి ప్రియా ప్రకాష్ కారణంగా 'లవర్స్ డే' సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని, హీరోయిన్ గా తీసుకొని సైడ్ క్యారెక్టర్ చేసేసారని నటి నూరిన్ షరీఫ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మాటల్లో నిజం లేదని అంటోంది ప్రియా ప్రకాష్. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒరు అడార్ లవ్' సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేశారు.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ప్రియా కాదని ఆమెకి వచ్చిన పాపులారిటీతో నిర్మాతలు కథ మార్చమని ఒత్తిడి చేయడంతో అలా చేయాల్సి వచ్చిందని దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నూరిన్ కూడా ప్రియాపై ఆరోపణలు చేసింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ప్రియా ప్రకాష్.. దర్శకుడు, నూరిన్ చేసిన ఆరోపణలను ఖండించారు.

తన కారణంగా నూరిన్ ని పక్కన పెట్టలేదని.. వాళ్లు చెప్పేది నిజం కాదని అన్నారు. 'మాణిక్య మలరయ' పాట హిట్ అయిన తరువాత సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇచ్చారనే మాటల్లో నిజం లేదని అంటోంది ప్రియా ప్రకాష్. దర్శకుడికి తన నటన నచ్చడంతో ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చారని, తన కోసం స్క్రిప్ట్ మార్చలేదని క్లారిటీ ఇచ్చింది.

నూరిన్ గురించి ప్రస్తావిస్తూ.. నూరిన్ ఈ సినిమాతో చాలా కనెక్ట్ అయిందని, ఎన్నో ఆశలు పెట్టుకుందని చెప్పిన ప్రియా.. సినిమాతో తనతో స్క్రీన్ షేర్ చేసుకునే విషయంలో ఆమె అప్సెట్ అయి ఉంటుందని చెప్పుకొచ్చింది. తను ఎవరి అవకాశాలను లాక్కోలేదని స్పష్టం చేసింది.