బ్లాక్‌బస్టర్‌ హిట్‌  రోబో ('ఎంథిరన్'‌) కథ కాపీ వివాదం ఇప్పుడిప్పుడే తెమిలేటట్లు లేదు. తాజాగా ఈ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అరూర్‌ తమిళ్‌నాడన్‌ అనే వ్యక్తి తను రాసిన 'జిగుబా' కథను కాపీ చేసి 'ఎంథిరన్'‌గా తీశారంటూ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశాడు. తనకు న్యాయం జరగాలంటూ కొన్నేళ్ల క్రితం కోర్టుకెక్కాడు. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నా శంకర్‌ కోర్టుకు హాజరు కాలేదని ఆరోపణ. దీంతో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ రెండో కోర్టు అతడికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.  

ఈ కేసు చాలా కాలం నుంచీ నడుస్తోంది. రోబో 2 రిలీజ్ సమయంలోనూ పెద్ద వివాదమైంది. అప్పట్లో ఈ కథా రచయిత కోర్టుకు వెళ్లి తనకు నష్టపరిహారంగా రూ.కోటి ఇప్పించాలని కోరారు. అయితే అప్పటికే గత ఎనిమిదేళ్ల నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది.  అయితే శంకర్ వెళ్లకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్ ను కోర్టుకు పంపారు. దీంతో  శంకర్ ఆ కథ తనదేనని నిరూపించుకోవాలని అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శంకర్ ఆ కథ తనదేనని క్లెయిమ్ చేస్తూ....మద్రాసు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లకి ఈ కేసు వ్వవహారంపై శంకర్ వార్తల్లోకి ఎక్కారు.

ఇక  తమిళ్‌నాథన్‌ రాసిన 'జిగుబ' కథ 1996లో ఓ మ్యాగజైన్‌లో పబ్లిష్‌ అయింది. తర్వాత 2007లో 'ధిక్‌ ధిక్‌ దీపిక ధీపిక' అనే నవలగా ప్రచురితమైంది. ఈ కథను కాపీ కొట్టి శంకర్‌ 'ఎంథిరన్'‌ తెరకెక్కించాడని, ఇది కాపీరైట్స్‌ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించాడు. తన స్వంత కథతో ఎంథిరన్‌ టీమ్‌ మొత్తం లాభం పొందిందని పేర్కొన్నాడు.  

శంకర్ తీసిన సినిమాను కాపీ చేశారంటూ.. వయోలేషన్ ఆఫ్ ద కాపీ రైట్ యాక్ట్, 1957కింద కంప్లైంట్ చేశారు. తన ఐడియాతో పెద్ద ఎత్తులో ఆర్థిక లాభం పొందారని ఆరోపించారు.

యంతిరన్ (రోబో) సినిమా 2010లో అత్యధిక ఇండియా ఫిల్మ్ రెండు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులో రోబోగా, హిందీలో రోబోట్ గా డబ్బింగ్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో యంతిరన్ సినిమాలో హీరో కమ్ విలన్ గా రజినీ కనిపించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, డ్యానీ డెంజోగపా, సంతానం, కరునాస్ లతో పాటు ఇతరులు మరికొన్ని పాత్రల్లో కనిపించారు.