తెలంగాణా ప్రభుత్వం ప్రీమియర్ షోలు, ఫ్యాన్స్ షోలకు పర్మిషన్లు ఇవ్వడం మానేసింది. ఒకరకంగా తెలంగాణాలో ప్రీమియర్ షోలను బ్యాన్ చేశారనే చెప్పాలి. గతంలో స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. అర్ధరాత్రి షోల హంగామా ఉండేది.

టికెట్ రేటు వెయ్యి నుండి నాలుగైదు వేల వరకు పలికేది. కానీ తెలంగాణా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ప్రీమియర్ షోలకు పర్మిషన్స్ ఇవ్వడం లేదు. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఏపీలో రాత్రి 3 గంటలకే ఫ్యాన్స్ షోలు వేసే అవకాశం ఉంది.

తెలంగాణాలో మాత్రం ఉదయం 8:45 వరకూ షో వేసే ఛాన్స్ లేదు. 'సాహో' చిత్రబృందం మాత్రం కనీసం ముప్పై థియేటర్లలోనైనా ప్రీమియర్ షోలకు అనుమతి పొందడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందు అంటే ఆగస్ట్ 29న మాత్రం ఓ ప్రీమియర్ ఉండే అవకాశాలున్నాయి.

ఈ షో కూడా సినీ ప్రముఖులు, మీడియా వారికి పరిమితం చేసే అవకాశం ఉంది. ఫ్యాన్స్ షోలకు అనుమతి లేకపోయినా.. విడుదలకు ఒక్కరోజు ముందు ప్రీమియర్ వేసే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఫ్యాన్స్ షోలకు గనుక పర్మిషన్ ఇస్తే అప్పుడు ప్రీమియర్ ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కాస్త కష్టమనే అనిపిస్తోంది.