మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమా 'సై రా నరసింహారెడ్డి'. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా విషయంలో చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఇది బయోపిక్ కావడంతో అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాల గురించి ఆలోచించకూడదు.

దీంతో చిరు తన స్టైల్ నుండి బయటకి వచ్చి సినిమాకు ఏం కావాలో అదే కథలో ఉండేలా చూసుకుంటున్నాడు. 'సై రా' ఓ యోధుడి కథ.. దానికి తగ్గట్లే సినిమా హుందాగా ఉండాలని చిరు చెప్పారట. ఈ సినిమాలో ఓ జానపద గీతం ఉంది. అందులో చిరంజీవి కొన్ని మాస్ స్టెప్పులు చేయాల్సివచ్చిందట.

సినిమా రషెస్ చూసుకుంటున్న సమయంలో చిరుకి ఓ అనుమానం వచ్చిందట. సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాంటి స్టెప్పులేస్తే ఎలా అని భావించి ఆ సన్నివేశాలను కట్ చేయించారని సమాచారం. కాబట్టి 'సై రా' సినిమాలో మెగాస్టార్ అభిమానులు ఆశించే విధంగా డాన్స్ లు, స్టెప్పులు ఉండవని తెలుస్తోంది.

అలానే క్లైమాక్స్ విషయంలో కూడా చిరు, సురేందర్ రెడ్డి ఎంతగానో ఆలోచించారట. చరిత్ర ప్రకారం బ్రిటీష్ వారు నరసింహారెడ్డి తలను నరికి, కోట గుమ్మానికి వేలాడదీస్తారు.  సినిమా చిరంజీవిని చంపడమంటే అభిమానులు ఊరుకుంటారా..?అనే సందేహాలు కలిగినప్పటికీ.. చరిత్ర కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తీయాలని చిరంజీవి చెప్పడంతో నెగెటివ్ క్లైమాక్స్ కి ఓటేసినట్లు తెలుస్తోంది!