హీరోయిన్ నిత్యా మీనన్ ప్రజెంట్ జనరేషన్ నటీమణులతో పోల్చుకుంటే ఓ ప్రత్యేకత ఉంది. కేవలం నటన, అందమైన హావ భావాలతోనే నిత్య ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. నిత్యా మీనన్ ఎప్పుడూ కమర్షియల్ చిత్రాల వెంట పడలేదు. అవకాశాలే ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. 

త్వరలో నిత్యా మీనన్ అరుదైన ఘనత సాధించబోతోంది. నిత్యా మీనన్ ఇప్పటివరకు సౌత్ ఇండియన్ భాషలు, హిందీలో మొత్తం 49 చిత్రాల్లో నటించింది. త్వరలో అర్థ సెంచరీ పూర్తి చేసుకోబోతోంది. నిత్యామీనన్ నటించబోయే 50 వ చిత్రం 'అరం తిరుకల్పన'. మలయాళంలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో నటిస్తున్నాడు. 

అజయ్ దేవలోక ఈ చిత్రానికి దర్శకుడు. 2008 లో మలయాళీ చిత్రంతో తన కెరీర్ ని ప్రారంభించిన నిత్యా మీనన్ ప్రస్తుతం మలయాళీ చిత్రంతోనే 50 వ చిత్ర మైలురాయిని అందుకోబోతోంది. 

నిత్యా మీనన్ తెలుగులో నటించిన తొలి చిత్రం అలా మొదలైంది. ఆ చిత్రంలో నిత్యా మీనన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత నిత్యా మీనన్ ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. నిత్యా మీనన్ ఎంత క్రేజ్ సంపాదించినా హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయలేదు.