టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది మొదట్లోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్‌, తరువాత లాక్‌ డౌన్‌ కారణంగా పెళ్లికి బ్రేక్‌ పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు నితిన్‌. కానీ లాక్‌ డౌన్‌ నితిన్ ఆశల మీద నీళ్లు చల్లేసింది. దీంతో పరిస్థితి చక్కబడ్డాక పెళ్లి చేసుకోవాలని భావించినా ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించటంలేదు. దీంతో ఇక లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పెళ్లికి చేసుకోవాలని నిర్నయించుకున్నాడు.

ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించిన నితిన్, ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఓ లగ్జరియస్‌ హోటల్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులైన అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాడు నితిన్‌. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించాడు నితిన్‌.

తాజాగా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌ను కూడా తన వివాహ వేడుకకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పవన్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యువ హీరో వరుణ్ తేజ్‌లకు కూడా నితిన్‌, షాలినిల పెళ్లికి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది.