మొత్తానికి నితిన్ తన కొత్త చిత్రం ప్రకటన అఫీషియల్ గా చేసారు. ఇవాళా..రేపా అన్నట్లు నాన్చుతూ వస్తున్న వ్యవహారం నితిన్ పుట్టిన రోజుకు ఓ కొలిక్కి వచ్చింది. బర్తడే సందర్బంగా ఆయన కొత్త చిత్రానికి టైటిల్, లుక్ ని వదిలింది యూనిట్.  ఈ సినిమా గురించి దర్శకుడు వెంకి కుడుముల తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఆసక్తికరమైన కామెంట్ చేసారు. 

తొమ్మిది గ్రహాలు, ఏడు సముద్రాలు,  204 దేశాలు, 3 బిలియన్ల మంది మహిళలు. అయినా అతను మాత్రం ఒంటరిగానే మిగిలి  పోయాడు. అతడి కథతోనే ‘భీష్మ’ తెరకెక్కుతోంది. నితిన్‌  హీరోగా నటిస్తున్న చిత్రమిది. సింగిల్‌ ఫరెవర్‌... అనేది ఉప శీర్షిక. రష్మిక మందన్న హీరోయిన్. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

‘‘కొంచెం గ్యాప్  తర్వాత చేస్తున్న కమర్షియల్ కథ ఇది. పక్కాగా కడుపుబ్బా నవ్వించే వాణిజ్య చిత్రమిది’’ అంటూ ట్వీట్‌ చేశారు నితిన్‌. అయితే  ట్యాగ్ లైన్ గా సింగిల్‌ ఫరెవర్‌... పెట్టినందుకు మాత్రం మా అమ్మ మిమ్మల్ని చంపాలనుకొంటోంది అంటూ తన చిత్రం టీమ్  గురించి  సరదాగా అందులో పేర్కొన్నారు.