మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా తమిళ 'జిగర్తండా'కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో మొదలైన ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ క్రమంగా ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం మరో పోస్టర్ ని విడుదల చేసింది. 

ఈ పోస్టర్‌లో వరుణ్ నోట్లో సిగార్ పెట్టుకుని, గన్‌ను భుజాన వేసుకుని  సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫోటో ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'నేను వస్తున్నా! సెప్టెంబర్ 20న' అని ట్వీట్‌ చేశాడు వరుణ్. దీనిపై స్పందించిన హీరో నితిన్.. వరుణ్ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ.. 'నేను చూస్తున్నాసెప్టెంబర్ 20న' అని పేర్కొన్నారు.

ఇది చూసిన వరుణ్ నవ్వుతున్న  ఎమోజీలను పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో నితిన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు నితిన్ అదే ప్రశ్నిస్తున్నారు. కానీ నితిన్ మాత్రం ఇంకా స్పందించలేదు.