శర్వానంద్ నటించిన తాజా చిత్రం 'రణరంగం'. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత ఏడాది శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు చిత్రం నిరాశపరిచింది. రణరంగంపై శర్వా పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న రణరంగం చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 

ఇటీవల చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమానికి యంగ్ హీరో నితిన్ అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ రణరంగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శర్వానంద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి సోలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్నాడని నితిన్ ప్రశంసించాడు. 

రణరంగం చిత్ర కథ గురించి 6 నెలల క్రితం విన్నా. ఈ చిత్రంలో శర్వా మిడిల్ ఏజ్డ్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసింది. శర్వానంద్ చూస్తే యంగ్.. మిడిల్ ఏజ్డ్ పాత్ర ఎందుకు చేస్తున్నాడు.. సినిమా తేడా కొడుతుందని అనుకున్నా. కానీ టీజర్, ట్రైలర్స్ చూశాక తన అభిప్రాయం తప్పు అని తేలినట్లు నితిన్ తెలిపాడు. 

ఆ పాత్రలో శర్వానంద్ అద్భుతంగా సెట్ అయ్యాడని నితిన్ ప్రశంసించాడు. రణరంగం చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే తాను కూడా రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు నితిన్ తెలిపాడు. రణరంగం పెద్ద విజయం సాధించి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని నితిన్ కోరాడు.