రాత్రి అనక,పగలు అనక పనిచేసి రూపొందించిన సినిమాని ఓటీటిలో రిలీజ్ చేయాలని ఏ నిర్మాతా అనుకోడు. ఏ టీమ్ ఆశించదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అది చాలా మందికి తప్పటం లేదు. రిలీజ్ లేటు అయ్యేకొలదీ సినిమాపై ఇంట్రస్ట్ పోవటం తప్ప మరేమీ జరగదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో థియోటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా జనం ..భయం వదిలి వస్తారో లేదో తెలియదు. ఈ నేపధ్యంలో ఓటీటి ద్వారా డైరక్ట్ రిలీజ్ చేస్తే ఎంతో కొంత నష్టంతో బయిటపడవచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంది. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నట్లు...ఎవరూ ధైర్యం చేయటం లేదు. పెద్ద నిర్మాతలు ఎవరైనా ధైర్యం చేస్తే మిగతా వాళ్లు ఆ దారిలో ప్రయాణం పెట్టుకుందామనుకుంటున్నారు. 

తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్ధం' సినిమా పరిస్దితి అదే. సినిమా పూర్తై,సెన్సార్ కూడా పూర్తై చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓటీటి కు ఇద్దామా వద్దా అనే డెసిషన్ చాలా కాలంగా తేలటం లేదు. ఓటీటి వాళ్లు ఇచ్చే ఆఫర్..అంతలా లాభించదు. కానీ ఇప్పుడు తమ హార్డ్ డిస్క్ లో పెట్టుకోవటం కన్నా ఓటీటిలో వదలేయటం బెస్ట్ అనే నిర్ణయానికి నిర్మాత వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఓ లీడింగ్ ఓటీటి ఫ్లాట్ ఫామ్ వాళ్ళతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని మీడియాలో వినపడుతోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు. అఫీషియల్ గా ఏ ప్రకటనా రాలేదు. కానీ ఓటీటికు ఈ సినిమా ఇచ్చేస్తున్నారంటే ఖచ్చితంగా టీమ్ కు చాలా బాధ ఉంటుంది. తమ కష్టం ..పెద్ద తెరపై కాకుండా చిన్న తెరపై చూడాల్సి రావటం కష్టమే. నిర్మాత ఇష్టమే తన ఇష్టమని ఆల్రెడీ అనుష్క చెప్పింది. కోన వెంకట్...ఈ సినిమా పెద్ద తెరపైనే చూపాలని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
  
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు...ఓటీటి సంస్దలు...'నిశ్శబ్ధం' సినిమాతో పెద్ద సినిమాలను డైరక్ట్ ఓటీటిల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరో ఒకరు ప్రారంభిస్తే ..మంచి రేటు వస్తుందని మిగతా వాళ్లు సైతం ఉత్సాహం చూపిస్తారు. ఏ పెద్ద సినిమా ఓటీటిలోకి రాకపోతే మిగతా నిర్మాతలు ఎవరూ ముందుకు రారు. కాబట్టి 'నిశ్శబ్ధం' ని చూపించి మిగతా సినిమాలకు గాలం వేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా 'నిశ్శబ్ధం' సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అవి కూడా ప్లస్ అవుతాయని తమ ఓటీటి పాపులారిటీకి భావిస్తున్నారు. 

 హారర్‌ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఏప్రియల్ 2 వ తేదీన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు.  కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్‌ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శక, నిర్మాతలు ఈ సినిమాని ఓటీటికు ఇచ్చేద్దామనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న 'నిశ్శబ్దం'లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం.   మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గింది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్