Asianet News TeluguAsianet News Telugu

'నిను వీడని నీడను నేనే' రివ్యూ!

టాలీవుడ్ లో రొటీన్ కథలతో వచ్చే సినిమాలకు లైఫ్ ఉండడం లేదు. అందుకే స్టార్ హీరోలు సైతం కమర్షియల్ కథలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటున్నారు. 

ninu veedani needanu nene movie review
Author
Hyderabad, First Published Jul 12, 2019, 3:21 PM IST

టాలీవుడ్ లో రొటీన్ కథలతో వచ్చే సినిమాలకు లైఫ్ ఉండడం లేదు. అందుకే స్టార్ హీరోలు సైతం కమర్షియల్ కథలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటున్నారు. కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన 'నిను వీడని నీడను నేనే' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం కాకుండా మరెవరో కనిపిస్తే.. వినడానికి థ్రిల్లింగ్ గా ఉన్న ఈ పాయింట్ తో తెరకెక్కిన సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకున్న సందీప్ కిషన్ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అయిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
కొత్తగా పెళ్లైన జంట రిషి, దియా(సందీప్ కిషన్, అన్యాసింగ్)లు కార్ లో వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంటుంది. అక్కడ నుండి బయటపడి ఇంటికి చేరుకున్న తరువాత వీరిద్దరి జీవితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇద్దరూ అద్దంలో చూసుకున్నప్పుడు వారి ముఖాలు కాకుండా మరెవరి ముఖాలో కనిపిస్తుంటాయి. దీంతో రిషి అసలు వారి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక అసలు కారణాలు తెలుసుకోవాలని అనుకుంటాడు.

దీంతో ఓ మానసిక వైద్యుడు(మురళీశర్మ)ని కలవడానికి వెళ్తాడు. తన భార్య దియాని చర్చ్ ఫాదర్ ని కలవమని సలహా ఇస్తాడు. మానసిక వైద్యుడు రిషీని ఓ ఆత్మ వెంటాడుతుందని  గుర్తిస్తాడు. మరోపక్క చర్చి ఫాదర్ దియాకి 400 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనతో సంబంధం ఉందని గ్రహిస్తాడు. అసలు రిషి, దియాల జీవితాల్లో జరుగుతున్న అసహజ సంఘటనలకు గల కారణాలేంటి..? రిషిని వెంటాడుతోన్న ఆ ఆత్మ ఎవరిది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ : 
దర్శకుడు కార్తిక్ రాజు ఓ కొత్త కథను ఈ సినిమాతో పరిచయం చేశాడు. 2035వ సంవత్సరంలో కథను మొదలుపెట్టి ఆ తరువాత 2013కి తీసుకొస్తాడు. ఆసక్తికర పాయింట్ తో కథను మొదలుపెట్టిన దర్శకుడు సినిమా మొదటిభాగాన్ని అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. చనిపోయిన ఒక జంట మరొక జంట శరీరాల్లోకి ప్రవేశించడంమనేది కొత్తగా అనిపిస్తుంది. సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆశించిన మలుపులు సెకండ్ హాఫ్ లో కనిపించవు. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రీక్లైమాక్స్  తేలిపోయినట్లనిపిస్తుంది. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చి సినిమాను ఎండ్ చేసేశారు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ తక్కువగా, సూపర్ నేచురల్ పవర్స్ ఎక్కువగా చూపించడం కూడా సినిమాకి ప్లస్ అయింది. ఊహించని మలుపులు, ఆసక్తిరేపే సన్నివేశాలతో సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. 

ఎవరెలా చేశారంటే..?
హీరోగా సందీప్ కిషన్ కి చక్కగా నటించారు. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో అవలీలగా నటించాడు. ఎమోషనల్ గా ఏడిపించడంతో పాటు కామెడీ చేస్తూ నవ్వించాడు కూడా.. రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించేశాడు. హీరోయిన్ అన్యాసింగ్ కి మొదటి సినిమానే అయినప్పటికీ బాగా నటించింది. లుక్స్ పరంగా ఏవరేజ్ గా ఉన్నప్పటికీ నటన పరంగా 
మెప్పించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటాలు లేకుండా నటించింది. నటుడు వెన్నెల కిషోర్ కి ఈ సినిమా మంచి ప్రాధాన్యత దక్కింది. హీరోతో పాటు సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంటుంది. తనదైన కామెడీతో నవ్వించాడు. మురళీశర్మపై నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచారు. పోసాని కృష్ణమురళి తన నటనతో బాగా 
నవ్వించారు. 


టెక్నికల్ గా.. 
దర్శకుడిగా కార్తిక్ రాజు మంచి కథ ఎన్నుకున్నప్పటికీ సినిమాలో కీలకమైన మిస్టరీ సన్నివేశాలు తెరపై ఆవిష్కరించడంలో ఆయన పూర్తిగా విజయం సాధించలేదనిపిస్తుంది. అలానే అవసరం లేని చోట కూడా కామెడీ పెట్టి కాస్త విసిగించాడు. తమన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లైమాక్స్ లో వచ్చే మదర్ 
సెంటిమెంట్ సాంగ్ తప్ప మిగిలిన పాటలేవీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇలాంటి సినిమాలకు కెమెరా వర్క్ చాలా ముఖ్యం. సినిమాటోగ్రాఫర్ పికె వర్మ తన కెమెరా వర్క్ తో ఆకట్టుకున్నారు. ఎడిటింగ్ వర్క్ పై మరింత శ్రద్ధ చూపించాల్సివుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. 

మొత్తానికి.. 
ఓవరాల్ గా చూసుకుంటే రొటీన్ కథలకు భిన్నంగా ఓ కొత్త కథను తెరపై చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది. హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. 

రేటింగ్: 2.75/5

Follow Us:
Download App:
  • android
  • ios