నిఖిల్ గత కొద్ది కాలంగా చలీ చప్పుడూ చేయటం లేదు. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే ఆయన సెలక్టివ్ ప్రాజెక్టులతో ముందుకు వెల్తూండటంతో వేరే ప్రాజెక్టులు ఎనౌన్సమెంట్స్ కూడా రాలేదు. కానీ నిఖిల్.. వరస పెట్టి కథలు విని చివరకు మూడు కథలు ఓకే చేసినట్లు చెప్తున్నారు.

ఈ మూడు ప్రాజెక్టులు అతి త్వరలోనే దర్శకుడు ఎవరు, మిగతా టీమ్ ఏమిటి అనే విషయాలతో ప్రకటన రానుంది. అంటే ఈ సంవత్సరం ప్రస్తుతం తను చేస్తున్న 'ముద్ర' తో పాటు మరో రెండు రిలీజ్ కు రెడీ చేస్తున్నాడన్నమాట. ఇక ఈ సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ చేస్తానని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసారు.దాంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడి, కంగారు పడింది. 

ముద్ర విషయానికి వస్తే.. నిఖిల్ చాలా కాలంగా  ‘ముద్ర’ పై వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్  ఇంతకు ముందు ప్రకటించింది. కానీ రకరకాల కారణాలతో అది జరగలేదు. దాంతో  ఈ నెలాఖరు కు కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో గానీ రిలీజ్ చేసి హిట్ కొట్టాలనకుంటున్నారు.

డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. ఈ చిత్రంతోనూ హిట్ కొట్టాలని చూస్తున్నారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. మూవీ డైనమిక్స్ మరియు ఔరా సినిమాస్ బ్యానర్లపై టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్నలిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు. గన్ను కంటే పెన్ను గొప్పది అనే కాన్సెప్ట్‌తో జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న సమస్యలను గుర్తించడంలో మీడియా ఎటువంటి పాత్ర వహిస్తుంది. జర్నలిస్ట్‌గా నిఖిల్ తన కర్తవ్యంని ఎలా నిర్వర్తించాడు అనేదే ఈ చిత్ర మెయిన్ కథాంశంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.