మెగా డాటర్ నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసే సమయం దగ్గరపడుతోంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు ఇప్పటికే వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు తెలిపారు. అదే విధంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని, వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసారు.

 ఈ నేపధ్యంలో శుభలేఖల పంపిణీ ని ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు పూర్తి చేసారు. మరో ప్రక్క నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద పెట్టెలో పెళ్లి పత్రికతో పాటు అతిథుల నోరు తీపి చేయడానికి స్వీట్లు కూడా పంపారు. పత్రికలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను కూడా ముద్రించారు.   ప్రస్తుతం ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. నిహారిక-చైతన్యలకు ‘ఆల్‌ ది బెస్ట్’‌  చెబుతున్నారు. 

ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుక ఫొటోలు ఆకట్టుకున్నాయి. నిహారిక ఇంట్లో పసుపు కొట్టే శుభకార్యం కూడా నిర్వహించారు.  తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగబాబు నివాసంలో జరిగిన వేడుకల్లో నిహారికకు కాబోయే భర్త చైతన్య  పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఇంటి ఆవరణలో నిహారిక వేసిన రంగోలీని వరుణ్‌ తేజ్‌ ప్రశంసించారు. అనంతరం తన చెల్లి-బావలతో కలిసి వరుణ్‌ ఫొటోలకు పోజులిచ్చారు.

ఇటీవల నిహారిక తన స్నేహితుల కోసం బ్యాచిలరేట్‌ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. దీని కోసం వారితో కలిసి ప్రత్యేకంగా గోవా వెళ్లి వచ్చారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత నుంచి నిహారిక, చైతన్య సోషల్‌మీడియా వేదికగా ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుతూనే ఉన్నారు.

ఇక చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. ఆయన హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఆయనకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట.