మెగా ఫ్యామిలీలో ఒక యువకుడు ఉన్నాడంటే అతడు హీరో కావలసిందే.  చిరంజీవి నుండి శిరీష్ వరకు దాదాపు పది మంది మెగా ఫ్యామిలీ హీరోలు పరిశ్రమలో ఉన్నారు. ఈ కుటుంబంలో పుట్టిన కొడుకులే కాకుండా, బయట నుండి వచ్చిన అల్లుళ్ళు కూడా హీరోలుగా మారిన విషయం  తెలిసిందే. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆయన హీరోగా మరో సినిమా ప్రస్తుతం తెరకెక్కుతుంది. కాగా మెగా ఫ్యామిలీలోకి కొత్తగా ఎంటరయ్యాడు చైతన్య జొన్నలగడ్డ. ఆరడుగులకు పైగా హైట్ మంచి ఫిజిక్ కలిగిన చైతన్య హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.

వచ్చే ఏడాది చైతన్య నటించే నూతన చిత్రంపై అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. చైతన్య సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నారట. నాగబాబు కూడా మంచి సబ్జెక్టు సెలెక్ట్ చేసి అల్లుడిని హీరోగా నిలబెట్టాలని అనుకుంటున్నాడట. కొడుకు వరుణ్ తేజ్ హీరోగా ఓ స్థాయికి వెళ్లారు. అల్లుడు కూడా సక్సెస్ అయితే నాగబాబు నక్క తోక తొక్కినట్లే. 

ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్య ప్రస్తుతం ఓ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక- చైతన్యల వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబం నుండి అందరూ హాజరై సందడి చేశారు. దాదాపు ఐదు రోజులు అక్కడ వేడుక నిర్వహించారు. రాజస్థాన్ లో పెళ్లి అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.