బిగ్‌బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లో అభిజిత్‌ విన్నర్‌గా నిలిచారు. ఊహించినట్టే జరగడంతో అందులో పెద్ద కిక్కేమి లేదు. కానీ ఆడియెన్స్ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో, గ్రాండ్‌ ఫినాలెలో జరిగిన సంఘటనలతో నిజమైన విన్నర్‌ సోహైల్‌ అని అంతా అంటున్నారు. మనసులు గెలుచుకున్న అసలైన విజేత సోహైల్‌ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 

నిజమే బుల్లెట్‌లా దూసుకొచ్చిన సోహైల్‌ టాప్‌ 3లోనే స్వతహాగా వైదొలిగాడు. 25 లక్షలు ఆఫర్‌ని స్వీకరించి ట్రోఫీ పోటీ నుంచి బ్యాక్‌ అయ్యారు. కానీ ఆడియెన్స్ తోపాటు, నెటిజన్లు, ఇతర ప్రముఖుల మనసులను గెలుచుకున్నారు సోహైల్‌. ఆయన ఆట విధానంతోపాటు చివర్లో ఆయన ప్రవర్తించిన విధానం, ఓ ఎన్జీఓకి ఇచ్చి డబ్బులు ఇస్తామనడం, దీనికి మెహబూబ్‌ సైతం పోటీపడటం, మెహబూబ్‌కి కూడా ఐదు లక్షలిస్తా అనడం వంటివి ఆకట్టుకున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించాయి. 

బిగ్‌బాస్‌ ఆఫర్‌ 25 లక్షలివ్వగా, నాగార్జున మరో పది లక్షలు ప్రకటించాడు. అలాగే చివర్లో చిరంజీవి మరో పది లక్షలు ఇస్తామని చెప్పాడు. అంతేకాదు వేదికమీదే పది లక్షల చెక్‌ అందించాడు. అంతటితో సోహైల్‌ కథ ముగియలేదు. ఏకంగా చిరంజీవి ఇంటి నుంచి బిర్యాని పొందాడు. తన ఇంటి నుంచి సోహైల్‌ కోసం బిర్యాని తీసుకొచ్చి అందరి ముందు వేదికపై చెప్పాడు చిరంజీవి. అంతేకాదు ఓ వీడియోని కూడా చూపించాడు. సురేఖ స్వయంగా ఇది తయారు చేసినట్టు చిరు తెలిపి అందరి హృదయాలను గెలుచుకున్నాడు చిరు. 

ఇంతటితో ఆగలేదు.. సోహైల్‌ ఎలాగైనా మంచి సినిమా తీస్తానని, తనకు సపోర్ట్ చేయాలని చిరంజీవిని కోరాడు. అయితే కచ్చితంగా తాను సపోర్ట్ చేస్తానని అందరు ముందు ప్రకటించారు. ఆడియో, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్ లో గెస్ట్ గా పాల్గొని ఎంకరేజ్‌ చేయాలన్నారు. అందుకు చిరంజీవి స్పందించి ఏకంగా నాకు చిన్న కోమియో పెట్టు చేస్తానని చెప్పడం విశేషం. చిరంజీవి నోటితో ఇలా మాట్లాడటంతో, బయటకు రాకముందే వెలకట్టలేని ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు సోహైల్‌. 

ఈ దెబ్బతో పెద్ద పెద్ద దర్శక, నిర్మాతల దృష్టిలో పడ్డారు. ఇక సోహైల్‌ లైఫ్‌ టర్న్‌ అయిపోయినట్టే అని, డే అండ్‌ నైట్‌లో స్టార్‌ అయిపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు. బిగ్‌బాస్‌ ఇచ్చే మనీ కంటే వెలకట్టలేని ఆస్తిని, ఇమేజ్‌ని కేవలం గ్రాండ్‌ ఫినాలె ద్వారా, చిరంజీవి ద్వారా ఫ్రీగా కొట్టేశాడని నెటిజన్లు అంటున్నారు. అన్ని రకాలుగా సోహైల్‌  అసలైన విజేతగా, తిరుగులేని విజేతగా నిలిచాడని చెప్పొచ్చు.