బిగ్ బాస్ షో మెల్లగా హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. వివాదాస్పద టాస్కులు ఇస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు కొందరి కోపానికి కారణం అవుతున్నారు. వెంట్రుకలు కత్తిరించడం, అర గుండు చేయడం వంటి విషయాలు వివాదాస్పదం అయ్యాయి. కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో బిగ్ టీం సభ్యులలో ఒక అమ్మాయి మెడపై వరకు కత్తిరించుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన హారిక తన జుట్టు కత్తిరించుకుంది. 

ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున అమ్మ రాజశేఖర్ కి కఠినమైన టాస్క్ ఇవ్వడం జరిగింది. వచ్చేవారం ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఇస్తాను, అర గుండుకు సిద్ధమా అన్నారు. ఆ ఛాలెంజ్ అంగీకరించిన రాజశేఖర్ అరగుండు, మీసం తీయించుకున్నాడు. ఈ రెండు టాస్క్ లు బిగ్ బాస్ షో పై కొందరి ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఎప్పటి నుండో సాంప్రదాయ వాదులు బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. ఈ షో భారత సాంప్రదాయానికి విరుద్ధం అని అంటున్నారు. 

గతంలో ఈ షో హోస్ట్ గా ఉన్న నాగార్జునను హెచ్చరించడంతో పాటు, ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. తాజా వివాదాస్పద టాస్క్ ల కారణంగా షోపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజెన్స్ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. షో హోస్ట్ గా ఉన్న నాగార్జునపై సైతం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాల సంగతి ఎలా ఉన్నా బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది.