ఎన్నికల సీజన్ కావటంతో వరస పెట్టి పొలిటికల్ జోనర్  సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ వరసలోనే విడుదలైన చిత్రం "నేనే ముఖ్యమంత్రి" . పూర్తిగా కొత్త నటులతో, కొత్త దర్శకుడితో రూపొందిన ఈ చిత్రానికి పొలిటికల్ జోనర్ కావటం , నేనే ముఖ్యమంత్రి అనే టైటిల్ తో కొంత క్రేజ్ అయితే వచ్చింది. పైగా పోస్టర్లు , ట్రైలర్ లలో  ఆంధ్రకు చెందిన  రాజకీయనాయకుల ను పోలి ఉండేలా చూడటంతో ఈ సినిమా కొంత క్రేజ్ అయితే సంపాదించుకుంది.

దానికి తోడు యాత్ర రిలీజు అవుతున్న రోజే విడుదల చేయటం కూడా జనాల దృష్టి ఈ సినిమాపై పడేలా చేసింది. అయితే అవన్నీ సినిమా విజయానికి ఎంతవరకూ ఉపయోగపడతాయి.. ఇంతకీ ఈ చిత్రం ఏ పార్టీని సపోర్ట్ చేస్తోంది. టార్గెట్ ఆడియన్స్ ఎవరు...వారిని ఎంతవరకూ మెప్పిస్తుంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం. 

 

కథ..

రాష్ట్ర రాజకీయాలను శాసించే పెద్దబ్బి(రామరాజు) కి కోర్ట్ లో ఎదురు దెబ్బ తగలతం తో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి తనకు సహాయం చేయలేకపోతున్నాడు అనుకున్న పెద్దబ్బి ఒక స్టార్ హీరో ని సియం చేయాలి అనుకుంటుండగా అనుకోకుండా చనిపోతాడు, అప్పుడు పెద్దబ్బి కొడుకు చిన్నబ్బి (శశికుమార్) రంగంలోకి దిగి తానే ముఖ్యమంత్రి కావాలి అని ప్రయత్నిస్తుంటాదు,అది  నచ్చని పార్టీ అతని మీద సిబీఇ ఎంక్వేరీ వేస్తుంది . ఆ సిబీఇ కి  జనపక్షం పార్టీ అధినేత సూరిబాబు తో పాటు, మరో సామాజిక వేత్త అభిరాం (వాయు తనయ) కొన్ని సాక్ష్యాలు అందచేస్తారు.

ఇంతలో చిన్నబ్బి తో కల్సిపొయిన నేషనల్ పార్టీ  చిన్నబ్బి తో మహాసేన అనే కొత్త పార్టీ పెట్టిస్తుంది . ఎన్నికల్లో ఇరు పార్టీలతో పాటు,, నేషనల్ పార్టీ కూడా మహాసేనకు మద్దతు ఇస్తూనే పైకి పోటి చేస్తుంది. కానీ జనపక్షం పార్టీ గెలుస్తుంది. సూరిబాబు (దేవిప్రసాద్) ముఖ్యమంత్రి అవుతాడు  ఆ తర్వాత ఆ జనపక్షం పార్టీని అధికారం లో నుండి దించేయటం కోసం మహాసేన, నేషనల్ పార్టీ  ఎలాంటి కుట్రలు చేశాయి, వాటిని జనపక్షం ఎలా తిప్పికొట్టింది ..దానికోసం జనపక్షం ఎలాంటి పనులు చేసింది .. ఇందులో ఎవరు మంచి, ఎవరు చెడు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

 

ఎలా ఉందంటే.. 

ప్రస్తుతం ఆధ్ర  రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే క్లారిటీగా అర్దమవుతుంది. ఆ పాత్రలను ఊహించగలుగుతూ సినిమా చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు.   సినిమాలో  వచ్చే సన్నివేశాలన్ని అంతకుముందే మన రాష్ట్రంలో వివిధ సందర్భాలల్లో  మనకు అంతకుముందే తెలిసినవే.  అలాగే ఈ సినిమా సాధారణంగా ఉండే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా విలన్ పాయింట్ అఫ్ వ్యూలో ఉంటుంది. ఆ బలమైన విలన్ ని ఎదిరించటానికి అందరూ కలిసి అతన్ని ఓడించటం అనేదే ఈ సినిమాలో హైలైట్.

ఈ సినిమాలో చూపిన గనుల మాఫియా నుండీ, ఎమ్మెల్యేల కొనుగోలు దాక అందరికి తెలిసినవే.. కాకపోతే అ సన్నివేశాలను ఎంత బలంగా తన కథకు కు వాడుకున్నాడు అనేది ముఖ్యం . ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.  చిన్నబ్బి కారెక్టర్ ని దానికి పోటిగా ఉన్న సూరిబాబు ని అతనికి అండగా నిలబడే అభిరాం పాత్ర కాని, వాళ్ళిద్దరూ కలవటానికి ఉండే రీజన్స్ ఇవన్నీ కరెక్ట్ గానే డిల్ చేశాడు, కానీ సినిమా చూస్తున్నంతసేపు ఇది  మన రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీకి అనుకూలంగా తీశారు అని స్పష్టంగా అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్లే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. 

 

దర్శకుడుగా మోహన్ రావిపాటి..

మిగతా విషయాలకొ స్తే దర్శకుడు మోహన్ రావిపాటి కి ఇది మొదటి సినిమా .తొలి చిత్రానికి ఎవరూ ఇలాంటి సబ్జెక్టు ని ఎంచుకోరు.  అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి కంఫ్యజన్ లేకుండా రూపొందించాడు. కాకపోతే కొన్ని చోట్ల తడబడ్డాడనిపిస్తుంది.  కొత్తవారైన  నటుల దగర నుండి నటన రాబట్టుకోవటం లో సక్సెస్ అయ్యాడు .  సీనియర్ నటులైన  శుభలేఖ సుధాకర్ , రామరాజు , నళినీ కాంత్ లాంటి నటులలను కూడా  బాగా డీల్ చేసారు. 

 

నటీనటులు.. 

నీది నాదే ఒకే కథ తర్వాత  దర్శకుడు దేవీప్రసాద్ ఈ సినిమాలో సూరిబాబు పాత్రలో  గుర్తిండిపోయే నటనలో కనిపిస్తారు. మిగతా నటినటుల్లో  చిన్నబ్బి పాత్ర చేసిన శశికుమార్  ఆ కారెక్టర్ వెయిట్ ని మైయింటైన్  చేయటం లో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. శశికుమార్  కూడా బాగా చేసారు !  అభిరాం పాత్ర చేసిన వాయు తనయ్ కొత్తవాడైనా అది ఎక్కడా కనపడనీయలేదు.   సిబీఇ ఆఫీసర్ సత్య గా చేసిన షాహీన్ గ్లామర్  ప్రదర్శన కు అవకాసం లేకపోవటం కలిసొచ్చింది. 

 

డైలాగులు..

ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలో కూడా దర్శకుడు రచయిత  అయిన మోహన్ రావిపాటి బాగానే రాణించారు.  

 

టెక్నికల్  గా...

కమలాకర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఫణికళ్యాణ్   పాటలు జస్ట్ ఓకే, త్రినాద్ మంతెన నేపధ్య సంగీతం కొంచెం హెవీగా అనిపిస్తుంది . బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్ ఇబ్బందిగా ఉంది. ఇక ఈ సినిమాలో ఫైటింగ్ అవసరం ఏముందో అర్ధం కాలేదు. ఉన్న ఆ ఫైట్ కూడా జస్ట్ ఓకే అన్నట్లుగా ఉంది . 

 

ఫైనల్ థాట్...

చూసేవాళ్ల సౌలభ్యం కోసం  కాస్త తెలిసివున్న ఆర్టిస్ట్ లను పెట్టుకుంటే బాగుండేది

రేటింగ్: 2/5

ఎవరెవరు..

నటీనటులు - శశి కుమార్, వాయు తనయ్ , షాహిన్ , దేవీప్రసాద్ , శుభలేఖ సుధాకర్ , నళిని కాంత్ , రామరాజు తదితరులు 

సినిమాటోగ్రఫీ  - కమలాకర్ 

సంగీతం -  ఫణి కళ్యాణ్ 

నేపధ్య సంగీతం - త్రినాథ్ మంతెన 

 ఎడిటింగ్ బస్వా పైడి రెడ్డి

నిర్మాణం - వైష్ణవి ఫిలిమ్స్ , ఆలూరి క్రియేషన్స్ 

నిర్మాతలు - అట్లూరి నారాయణరావు . ఆలూరి సాంబశివరావు 

కథ -మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రావిపాటి