Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: నీవెవరో

'సరైనోడు'లో విలన్ గా, 'నిన్నుకోరి' సినిమాలో సెన్సిబుల్ హస్బండ్ గా, 'రంగస్థలం'లో అందరి బాగోగులు కోరే ఓ వ్యక్తిగా ఇలా రకరకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'నీవెవరో'. 

neevevaro telugu movie review
Author
Hyderabad, First Published Aug 24, 2018, 12:18 AM IST

నటీనటులు: ఆది పినిశెట్టి, రితికా సింగ్, తాప్సీ, వెన్నెల కిషోర్ తదితరులు 
సంగీతం: అచ్చు 
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: ప్రదీప్ 
నిర్మాతలు: కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ 
దర్శకత్వం: హరినాథ్

'సరైనోడు'లో విలన్ గా, 'నిన్నుకోరి' సినిమాలో సెన్సిబుల్ హస్బండ్ గా, 'రంగస్థలం'లో అందరి బాగోగులు కోరే ఓ వ్యక్తిగా ఇలా రకరకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'నీవెవరో'. ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచారు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
కళ్యాణ్(ఆది పినిశెట్టి) అంధుడు అయినప్పటికీ మంచి షెఫ్. తన టాలెంట్ తో ఎదిగి ఓ రెస్టారంట్ కి యజమాని అవుతాడు. అమితంగా ప్రేమించే తల్లితండ్రులు, తనంటే ప్రాణం పెట్టే స్నేహితురాలు అను(రితికా సింగ్), తన రెస్టారంట్ కి వచ్చే జనాలకు వంట చేసి పెట్టడం ఇదే కళ్యాణ్ జీవితం. అనుకి కళ్యాణ్ అంటే ఇష్టం. అదే విషయాన్ని ఇంట్లో కూడా చెబుతుంది. చిన్నప్పటి నుండి స్నేహితులు కావడంతో ఇంట్లో వారు కూడా పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం అను తన మీద జాలితో పెళ్లికి ఒప్పుకుందనే ఫీలింగ్. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కళ్యాణ్ రెస్టారంట్ లో ఉండగా.. వెన్నెల(తాప్సీ) అనే అమ్మాయి వస్తుంది. ఒక ముసలాయన ఆకలితో ఉన్నాడని కళ్యాణ్ సహాయంతో అతడికి భోజనం ఇస్తుంది. వెన్నెలలో ఆ లక్షణాలు ఇష్టపడిన కళ్యాణ్ ఆమెను ప్రేమిస్తాడు. వెన్నెల కూడా కళ్యాణ్ ని ఇష్టపడినట్లుగానే కనిపిస్తుంది.

తన ప్రేమ విషయాన్ని వెన్నెలకి చెప్పే సమయంలో ఆమె ఓ ప్రమాదంలో ఉందని కళ్యాణ్ తెలుసుకుంటాడు. మరుసటి రోజుకి కాల్ మనీ గ్యాంగ్ కి ఇరవై లక్షలు ఇవ్వకపోతే వెన్నెలని తీసుకువెళ్లిపోతారని కళ్యాణ్ కి తెలుస్తుంది. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ అనుకోకుండా అతడికి యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అతడికి చూపు తిరిగొస్తుంది. ఆ తరువాత వెన్నెల కోసం చాలా చోట్ల వెతుకుతాడు. కానీ ఆమె దొరకదు. మరోపక్క తన తల్లి బాధ పడుతుందని అనుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు కళ్యాణ్. అదే సమయంలో వెన్నెల తండ్రి కళ్యాణ్ ని కలిసి వెన్నెలను కాల్ మనీ గ్యాంగ్ ఎత్తుకుపోయిందని డబ్బు డిమాండ్ చేస్తున్నారని చెబుతాడు. దీంతో డబ్బులు ఇచ్చి వెన్నెలని తీసుకురావాలనుకుంటాడు. మరి కళ్యాణ్ కి వెన్నెల దొరుకుతుందా..?అసలు ఎవరీ వెన్నెల..? కళ్యాణ్ చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేదే సినిమా. 

విశ్లేషణ: 
గతేడాది తమిళంలో విడుదలై సక్సెస్ అందుకున్న 'అధె కంగల్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. వినూత్నమైన పాయింట్ తో ఈ కథను రాసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ లో కాల్ మనీ గ్యాంగ్ అని చూపించడంతో ఈ సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్ సాగుతుందని అనుకున్నారు. సినిమా ఇంటర్వల్ కి చేసే సమయానికి కూడా హీరోయిన్ ని 
కాల్ మనీ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందనే అనుకుంటారు. కానీ ఇంటర్వల్ సమయానికి ప్రేక్షకుల్లో సందేహాలు కలుగుతాయి. అసలు ఏం జరుగుతుందో ప్రేక్షకుల ఊహకు అందదు. అయితే సినిమా అప్పటివరకు కాస్త స్లో గా నడవడం, ఇంటర్వల్ టైమ్ కి ట్విస్ట్ లు రాసుకున్నప్పటికీ వాటిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చిత్రీకరించలేకపోయారు. తెరపై కొన్ని షాట్లు, సీన్లు ఇంకా బెటర్ గా తీయొచ్చనే భావన కలుగుతుంది.

హీరోకి కళ్లు వచ్చాక ప్రేమించిన అమ్మాయి ఏమైపోయిందా..? అని వెతికే ప్రాసెస్ లో అతడికి తెలిసే నిజాలు షాకింగ్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ చివరి అరగంట సేపు సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. సినిమా విలన్ క్యారెక్టర్ సరికొత్తగా రాసుకున్నారు. ఆ పాత్రను తెరపై పోట్రేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో మరో చిన్న ట్విస్ట్ తో సినిమాను ముగించడం బాగుంది. కొంత సమయం పాటు తెరపై అంధుడిగా కనిపించాడు ఆది పినిశెట్టి. ఆ పాత్ర చూస్తున్నంతసేపు 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ గుర్తొస్తాడు. అంధుడైనా అసలు తడబడకుండా విలన్స్ తో ఫైట్స్ చేస్తుంటాడు. ప్రేమించి అమ్మాయి కోసం పిచ్చోడిలా వెతుకుతూ తిరిగే పాత్రలో ఆది బాగా నటించాడు. సెకండ్ హాఫ్ తాప్సీతో ఆది కాంబినేషన్ సీన్లు పండాయి. వీరిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ ని ఎవరూ ఊహించలేరు. రితికా సింగ్ పాత్ర రెగ్యులర్ హీరోయిన్ మాదిరి అనిపిస్తుంది. తన పాత్రలో ఎలాంటి కొత్తదనాన్ని ఆశించలేమ్.

తాప్సీ రోల్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఓ పక్క క్యూట్ గా కనిపిస్తూనే మరోపక్క కన్నింగ్ ఆలోచనలతో కనిపించడం ప్రేక్షకులను బాగా  ఎంటర్టైన్  చేస్తుంది. ఆ పాత్రలో తాప్సీ అధ్బుత నటన కనబరిచింది. ఇక తాప్సీని తిడుతూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యే వెన్నెల కిషోర్ రోల్ 
కొంతసేపు పాటు సినిమాకు అనవసరం అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మాత్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. సప్తగిరి నవ్వించడానికి ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. శివాజీరాజా, 
తులసి, శ్రీకాంత్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు.

సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఛేజింగ్ సీన్ లో తెరపై సినిమాను చూడడం కష్టంగా అనిపిస్తుంది. ఫ్రేమ్ లో ఒక క్యారెక్టర్ ని ఫోకస్ చేస్తూ మిగిలిన వారిని ఔట్ ఫోకస్ చేయడం అర్ధం కాని విషయం. ఆరంభంలో ఇలాంటి సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి. సినిమాకు హైలైట్ గా నిలిచింది అచ్చు సంగీతం. ముఖ్యంగా తాప్సీ క్యారెక్టర్ తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే బీజియమ్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంత ఫాస్ట్ గా ఉండి ఉంటే బాగుండేది.

దర్శకుడిగా హరినాథ్ ఈ సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. అయితే ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ లో కాస్త సస్పెన్స్, సందేహాలు కలిగేలా చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి సినిమాలో తరువాత ఏం జరగబోతుందనే విషయంలో ప్రేక్షకులు కొంతవరకు గెస్ చేసే అవకాశం ఇచ్చేశారు. సస్పెన్స్ ను ప్రీక్లైమాక్స్ వరకు సాగించి అప్పుడు ట్విస్ట్ రివీల్ చేసి ఉంటే బాగుండేది. ఆద్యంతం ఆసక్తిగా సాగాల్సిన ఈ సినిమా కాస్త డల్ గా అనిపిస్తుంది. నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారనేది సందేహమే. రొటీన్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చివరి ఇరవై నిమిషాల కోసం సినిమా చూడాలనుకుంటే మాత్రం ఒకసారి సినిమాకు వెళ్లొచ్చు. 

రేటింగ్: 2.5/5 

Follow Us:
Download App:
  • android
  • ios