నీతూ కపూర్‌.. 1970, 80 దశకాల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన స్టార్‌ హీరోయిన్‌. మాక్సిమమ్‌ బాలీవుడ్‌ అగ్ర నటులతో ఆడిపాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, పాపులారిటీని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ అందాల నటుడు రిషికపూర్‌ని మ్యారేజ్‌ చేసుకున్నాక.. కూడా దాదాపు పదేళ్లపాటు హీరోయిన్‌గా నటించి మెప్పించారు. పిల్లలు(రణ్‌బీర్‌ కపూర్‌) పుట్టాక క్రమంగా సినిమాలు తగ్గించింది. అడపా దడపా చేసుకుంటూ వచ్చిన నీతూ.. 2013 తర్వాత పూర్తిగా మానేసింది. 

తాజాగా నీతూ కపూర్‌ ఈ ఏడాది రీఎంట్రీ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్‌ సిరీస్‌ `రామ్‌ బరణ్‌ సింగ్‌ః ది ఫ్యామిలీ ఆఫ్‌ ఆన్‌టోల్డ్ స్టోరీ`లో మెరిసింది. ఇప్పుడు `జగ్‌ జుగ్‌ జియో` అనే సినిమాలోనూ  కీలక పాత్ర పోషిస్తుంది. అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం నీతూ ఈ చిత్ర షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

ఆమె భర్త, సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఒంటరై పోయింది. భర్తను కోల్పోయిన ఆమె సెట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. `చాలా రోజుల తర్వాత సినిమా సెట్‌లో అడుగుపెట్టాను. ఏదో తెలియని భయం, ఒంటరిగా ఉన్న భావన కలిగించింది. సినిమా చేయడం కొత్త ప్రారంభంలా ఉంది. సినిమా మ్యాజిక్‌ ఇలానే ఉంటుందనుకుంటా. రణ్‌బీర్‌ ఉన్నాడనే ధైర్యంతో ముందుకెళ్తున్నా. ఇప్పుడు నాకు నేను అన్ని విషయాలు తెలుసుకుంటున్నా. మీరు ఏ లోకంలో ఉన్నా నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా` అని రిషికపూర్‌ని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని పంచుకుంది. 

దీనిపై బాలీవుడ్‌ సెలబ్రిటీలు అనిల్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, రిద్దిమా, మనీష్‌ మల్హోత్రా, వరుణ్‌ ధావన్‌ వంటి వారు స్పందించి తాము అండగా నిలుస్తామని నీతూలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇక నీతూ పంచుకున్న ఫోటోలో ఆమె సినిమా షూటింగ్‌ కోసం రెడీ అవుతున్నారు. మేకప్‌ వేసుకుంటున్నట్టుగా ఆ ఫోటో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.