బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఎన్బీకే108` మూవీ నెక్ట్స్ షెడ్యూల్ వాయిదా పడింది. తారకరత్న హఠాన్మరణంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య కోసం తన పంథా మార్చి అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ని మేళవిస్తూనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంది. అయితే తారకరత్న అనారోగ్యానికి గురైన నేపథ్యంలో అప్పట్నుంచి షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు.
బాలకృష్ణ పూర్తిగా తారకరత్నకి ట్రీట్‌మెంట్‌ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. వైద్యుల నుంచి అలాంటి సంకేతాలే రావడంతో ఇక తాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్న సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 23 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ తారకరత్న అనూహ్యంగా కన్నుమూశారు. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దాదాపు 23 రోజులపాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దీంతో ఇప్పుడు `ఎన్బీకే108` చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ని పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. క్లిష్ట సమయంలో తారకరత్న ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉంది. అందులోనూ బాలయ్య అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తారకరత్న, బాలయ్య మధ్య మంచి బాండింగ్ ఉంది. దీంతో పెద్ద కర్మ వరకు బాలకృష్ణ అన్ని కార్యక్రమాలు చూసుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది. నెక్ట్స్ షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
గతేడాది డిసెంబర్ 8న బాలయ్య ఎన్బీకే108 మూవీ ప్రారంభమైంది. షైన్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాని దసరాకి విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.
