జీవితంలో ఏ విషయంలో అయినా తొలి అనుభవం ప్రత్యేకమే. జీవితాంతం గుర్తుండిపోతాయి..తొలినాటి మధురిమలు. అయితే ఆ తొలి అనుభవం వివరాలు బయిటకు చెప్పటానికి ఎవరూ ఇష్టపడరు. తమ మనస్సులో ఉంచేసుకుంటారు. కానీ వృత్తిపరమైన తొలి అనుభవాలు మాత్రం పంచుకోవాలనిపిస్తుంది. ఆ రోజు ఏం జరిగిందంటే అని పదే పదే ప్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. ఇదిగో అలాంటి తొలి అనుభవాన్ని ఎగ్జైంటింగ్ గా ఫీలవుతోంది  మళయాలి భామ నజ్రియా నాజిమ్. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. నాని హీరోగా వస్తోన్న అంటే సుందరానికీ మూవీ షూటింగ్ కోసం నజ్రియా ఇక్కడకు వచ్చింది. ఈ రోజు నుంచి షూటింగ్‌లో జాయిన్ అయ్యానంటూ ఓ ప్రకటన ని సోషల్ మీడియా వేదికగా చేసింది.  

ఆ పోస్ట్ లో ఏముందంటే..‘అందరికీ నమస్కారం. ఈ రోజు నేను నా మొదటి తెలుగు మూవీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాను. తొలి అనుభవం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. అంటే సుందరానికీ అనేది నాకు ఎప్పుడూ ప్రత్యేకమే’ అని నజ్రియా తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.  

 ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి...’ అనే చిత్రమైన టైటిల్ తో సినిమా రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంగీత ప్రధానమైన  రొమాంటిక్‌ కామెడీ కథతో రూపొందుతున్న సినిమా అని చిత్రవర్గాలు చెప్తున్నాయి. ‘మునుపెన్నడూ లేని ప్రేమ, మునుపెన్నడూ లేనన్ని నవ్వులు’ అంటూ నాని అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా తరుణ్‌.

 నాని సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే 'టక్‌ జగదీష్‌' సినిమా పూర్తికాగా, కరోనా వేవ్ తగ్గాక థియేటర్లలోకి రానుంది. ఆయన నటిస్తున్న మరో సినిమా 'శ్యామ్‌ సింగరాయ్‌' షూటింగ్ దశలో వుంది.