సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు పెరిగే కొద్ది నయన్ ఇమేజ్ కూడా పెరుగుతోంది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ నయనతారనే. నయనతార ఎప్పుడూ వివాదాల్లో కనిపించదు. కానీ నయనతార వ్యక్తిగత విషయాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 

ప్రస్తుతం తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలో అత్తివరదరాజస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలసి స్వామివారిని దర్శించుకుంది. ఆలయ అధికారులు, అర్చకులు నయనతార, విగ్నేష్ శివన్ లకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. 

స్వామివారిని నయన్ దర్శించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్తివరదరాజస్వామి వారి దర్శనం భక్తులకు 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే లభిస్తుంది. 1979 తర్వాత మళ్ళీ ఇప్పుడే స్వామివారు దర్శనం ఇస్తున్నారు. ఈ ఉత్సవాలు 48 రోజుల పాటు జరుగుతాయి. జూన్ 1న ప్రారంభమైన స్వామివారి దర్శనం ఆగష్టు 17వరకు కొనసాగనుంది. ఆ తర్వాత స్వామివారిని తిరిగి పుష్కరిణిలో దాచిపెడతారు. 

అత్తివరదరాజస్వామివారిని దర్శించుకునేందుకు సినీ రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇక నయనతార ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, విజయ్ బిగిల్, రజనీకాంత్ దర్భార్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. నయన్, విగ్నేష్ శివన్ మధ్య చాలా రోజులుగా ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే.