కోలీవుడ్ స్టార్స్ నయనతార - విఘ్నేష్ శివన్ వివాహాం ఈ రోజు ఉదయమే చాలా గ్రాండ్ గా జరిగింది. స్టార్ కపుల్ ను అతిథులు ఆశీర్వదిస్తున్నారు. కాగా, ఈ రోజు ఉదయం విఘ్నేష్ శివన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
నయనతార (Nayanthara), ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) ఈ రోజు ఉదయం పంచభూతాల సాక్షిగా, కుటుంబ సభ్యులు, అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరి వివాహా వేడుకకు సినీ స్టార్స్, చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే, తమ వివాహా వేడుకకు సంబంధించి విఘ్నేష్ శివన్ ఈ రోజు ఉదయం ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఏమని పోస్ట్ చేశాడంటే.. ‘ఈరోజు జూన్ 9, ఇది నయన్ వివాహా రోజు. నా జీవితంలో నాతో ప్రయాణించిన వారందరి నుండి భగవంతుడు, విశ్వం నుంచి ఆశీస్సులు అందాయి. ఇందుకు ధన్యవాదాలు. నా జీవితంలో మంచి జరగాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.
ఇకపై నా ప్రేమ మొత్తంగా జీవితమంతా నయనతారకే అంకితం చేస్తున్నాను. ఈ రోజు కుటుంబం మరియు స్నేహితుల ముందు నా జీవితంలో మరో అధ్యాయనం ప్రారంభం కావడం సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నాడు. విఘ్నేష్ శివన్ చెప్పినట్టుగా పెళ్లికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలాగే జూన్ 11న నయనతార ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా కలుస్తామని విఘ్నేశ్ వివన్ హామీనిచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ స్టార్ జంట ఒక్కటవడంతో అటు సినీ రంగం నుంచి, ఇటు ప్రజాప్రతినిధుల నుంచి, అలాగే అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.
వీరిద్దరి వివాహానికి తారలు తరలి వస్తున్నారు. మహాబలిపురంలో వైభవంగా జరుగుతున్న నయనతార పెళ్ళికి అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, షారుఖ్ ఇప్పటికే మహాబలిపురం చేరుకున్నారు. అలాగే హీరో కార్తీ, నిర్మాత బోని కపూర్, విజయ్ సేతుపతి, శరత్ కుమార్ కూడా హాజరవుతున్నారు. ఇక నయనతార వివాహానికి సంబందించిన ఎలాంటి లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
