సాధారణంగా హీరోయిన్లకు క్రేజ్ వస్తే పదేళ్లు కొనసాగవచ్చు. ఆ తర్వాత సహజంగానే వారి కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. కానీ నయనతార అందుకు భిన్నం. లేడీ సూపర్ స్టార్ గా నయన్ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. దక్షిణాదిలో నయనతార అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్. 

ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా నయన్ తో మాత్రం పోటీ పడలేకున్నారు. సౌత్ లో నయనతార అగ్రహీరోలందరి సరసన నటించింది. నయనతార రీసెంట్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. నయనతార అందరి హీరోయిన్లలా కాదు. సినిమాలో నటించడం వరకే చేస్తుంది. ప్రచార కార్యక్రమాలకు నయన్ దూరంగా ఉంటుంది. అయినా కూడా దర్శక నిర్మాతలు నయన్ డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. 

నయనతారకు ఈ క్రేజ్ ఓవర్ నైట్ వచ్చింది కాదు. కెరీర్ ఆరంభంలో నయనతార ఓ మలయాళీ టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. నయనతార యాంకరింగ్ చేస్తున్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో నయన్ ని చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 

కానీ నయనతార ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉంది. అసలు ఈ వీడియోలో ఉన్నది నయనతారేనా అంటూ కొందరు అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో నయనతార తన అసలైన పేరు రివీల్ చేసింది. నయనతార అసలు పేరు 'డయానా మరియం కురియన్'. 

నయనతార వాయిస్ చాలా క్యూట్ గా ఉందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నయనతార మ్యానరిజమ్స్ మాత్రం అలానే ఉన్నాయని అంటున్నారు. నయనతార ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన దర్బార్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.