చిత్రం: డోర నటీనటులు: నయనతార, తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్,షాన్, తరుణ్ క్షత్రియ సంగీతం: వివేక్ మెర్విన్ సాలొమన్ దర్శకత్వం : దాస్ రామసామి నిర్మాత: మార్కాపురం శివకుమార్ ఏసియానెట్ రేటింగ్: 3/5

కథ...

కూతురు పారిజాతం(నయనతార)కు పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలని తండ్రి రామయ్య అనుకుంటూ ఉంటాడు. అయితే పారిజాతం మాత్రం తనను చిన్న చూపు చూసే వారందరితో ఛాలెంజ్ లు చేస్తూ ఉంటుంది. పారిజాతం తండ్రి మాత్రం కూతురికి పెళ్లి జరిగేలా ఆశీర్వదించమని కోరేందుకు కులదైవాన్ని దర్శించుకోవాలనుకుంటాడు. అలా ఓ సారి కార్ ట్రావెల్స్ బిజినెస్ చేసే తన మేనత్త దగ్గరికెళ్లి సొంతూల్లోని కులదైవాన్ని దర్శింకునేందుకు వెళ్లేందుకు కారు ఇవ్వాలని అడుగుతుంది. అయితే.. మేనత్త కారు ఇచ్చేందుకు నిరాకరించటమే కాకుండా అవమాన పరుస్తుంది. దాంతో అత్తను ఛాలెంజ్ చేసి ఎలాగైనా కారు కొని తాము ట్రావెల్స్ బిజినెస్ చేస్తామని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది.

ఇంటికెళ్లాక యథావిధిగా ఛాలెంజ్ లను మర్చిపోయే కూతురు పారిజాతానికి కారు కొంటామని అత్తతో చేసిన ఛాలెంజ్ ను గుర్తు చేస్తాడు తండ్రి రామయ్య. దాంతో తండ్రి కూడబెట్టిన డబ్బంతా తీసి సెకండ్ హ్యాండ్ కారైనా కొనాలని తండ్రితో కలిసి షో రూమ్ కు వెళ్తుంది పారిజాతం. అక్కడ కార్లు చూస్తూ... ఓ పాతకాలంనాటి వింటేజ్ కార్ ను చూస్తుంది. ఆ కార్ కూడా తనని పిలిచినట్టు ఫీలై అదే కారు కొని బిజినెస్ ప్రారంభిస్తుంది. అయితే ఆ కారులో ఓ కుక్క ఆత్మ ఉంటుంది. అదే డోర. ఇంతకీ ఆ కారులో కుక్క ఆత్మ ఎందుకుంది.. ఆకారుకు పారిజాతంకు ఏంటి సంబంధం... శత్రువును ఎలా అంతమొందించారు అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే...

హార‌ర్ సినిమాల‌కు టైట్ స్క్రీన్‌ప్లే, భ‌యం పుట్టించే రీరికార్డింగ్ మూలాధారమైనవి. ఈ సినిమాలో అవి రెండూ క‌నిపించ‌లేదు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. స్క్రీన్ ప్లే కూడా చ‌ప్ప‌గా ఉంది. న‌య‌న‌తార గ్లామ‌ర్‌ని ఎలివేట్ చేసే స‌న్నివేశాలు ఎక్కడా క‌నిపించ‌వు. ఇందులో శున‌కం ఆత్మ ప‌గ‌బ‌ట్టిన‌ట్టు చూపించారు. దాన్ని అయినా ఆక‌ట్ట‌కునేట‌ట్టు చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు అనుకున్న స్థాయిలో చూపించలేదు. ఇక దోపిడీల‌కు, హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ముఠా కోసం ప్ర‌య‌త్నించిన పోలీసులు క్లైమాక్స్ లో పత్తా లేకుండా పోయారు.

ప్లస్ పాయింట్లు...

నయనతార నటన ఆకట్టుకుంది. తండ్రీ, కూతుళ్లు చేసే కామెడీ ఓవైపు, నయనతార శత్రువులను అంతం చేసేందుకు కనబరిచిన పోరాట పటిమ ఆక‌ట్టుకుంటుంది. దినేశ్ కృష్ణ‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. హ‌రీశ్ ఉత్త‌మ‌న్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. సినిమాలో కాసింత రిలీఫ్ తంబిరామ‌య్య పాత్ర‌. గ్రాఫిక్స్ ఫ‌ర్వాలేదు. రీరికార్డింగ్‌ను రెగ్యుల‌ర్ హార‌ర్ సినిమాల్లాగా కాకుండా విభిన్నంగా ప్ర‌య‌త్నించారు. రెగ్యుల‌ర్ హార‌ర్ చిత్రాల్లోలాగా వికృతాకారాల‌ను చూపించ‌కపోవడం చెప్పుకోదగిన అంశం.

మైన‌స్ పాయింట్లు...

కథలో కొత్తదనం కనిపించలేదు. న‌వ వ‌ధువు హ‌త్య‌, దారిదోపిడీ, మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం అనే మూడు సంఘటనలను లింక్ చేస్తూ క‌థ‌ అల్లుకున్నాడు దర్శకుడు. సినిమాలో ఎక్కడా ఉత్కంఠ‌ క‌నిపించ‌లేదు. ఫస్టాఫ్ కాస్త బోర్ కొడుతుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ రావ‌డానికి ముందు వ‌ర‌కు ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్షే. లొకేష‌న్ల ప‌రంగానూ, విజువ‌ల్స్ ప‌రంగానూ చెప్పుకోద‌గ్గ‌వి ఏమీ లేవు. న‌టీన‌టులు కొత్త‌వారు కావ‌డంతో ఏ పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టించారో గుర్తుప‌ట్ట‌డం క‌ష్టం.

చివరగా...

పగ బట్టిన డోర, పగ తీర్చుకున్న పారిజాతం.