నవీన్,నరేష్ ల విఠలాచార్య సినిమాలో విజయనిర్మల

naveen naresh movie vithalacharya opening
Highlights

  • డా.నరేశ్ వి.కె., నవీన్ విజయకృష్ణ, అనీషా ఆంబ్రోస్‌, ఇంద్రజ కీలక పాత్రల్లో ‘విఠలాచార్య’
  • విఠలాచార్య సినిమాలో విజయనిర్మల
  • స్క్రిప్ట్ బుక్‌ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సుహాస్‌ మీరా దర్శకత్వం

‘‘విఠలాచార్య దర్శకత్వంలో నేను ‘ఇద్దరు మొనగాళ్ళు’ సినిమాలో నటించాను. ఆయన చాలా హిట్‌ చిత్రాలను తీశారు. ఇప్పుడు ఆయన పేరు టైటిల్‌గా వస్తున్న చిత్రంలో నరేశ్, నవీన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ. డా.నరేశ్ వి.కె., నవీన్ విజయకృష్ణ, అనీషా ఆంబ్రోస్‌, ఇంద్రజ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘విఠలాచార్య’ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి విజయనిర్మల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కృష్ణ క్లాప్‌కొట్టారు. బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. బ్రోచర్‌ను దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు.

స్క్రిప్ట్ బుక్‌ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సుహాస్‌ మీరా దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.కె.విశ్వేశబాబు, కె.ఎస్ .టి. యువరాజ్‌, యం.వి.కె.రెడ్డి నిర్మాతలు. నరేశ్ మాట్లాడుతూ ‘‘ఇందులో నేను, నవీన్, మా చిన్నబ్బాయి రణ్‌ధీర్‌, మా అమ్మ విజయనిర్మల కలిసి నటిస్తున్నాం. చాలా వైవిధ్యమైన స్ర్కిప్ట్‌ ఇది. ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ కాంటెక్స్ట్‌ ఉన్న సినిమా. మాస్‌, ఫ్యామిలీ, యూత్ కి నచ్చే అంశాలుంటాయి’’ అని చెప్పారు.

 

నవీన్ మాట్లాడుతూ ‘‘చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. నా కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది’’ అని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ‘‘మా మూడు తరాలు కలిసి చేస్తున్న సినిమా. మా తరతరాలు నటిస్తూనే ఉంటారు. విఠలాచార్యగారు చాలా పెద్ద దర్శకులు. ఆయన పేరుతో వస్తున్న చిత్రం హిట్‌ కావాలి’’ అని అన్నారు. చాలా మంచి కథతో సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని ఇంద్రజ, అనీషా ఆంబ్రోస్‌, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు.

 

‘విఠలాచార్య’ చిత్రంలో తన మాతృమూర్తి విజయనిర్మల నటించబోతున్నారని నరేశ్ ప్రకటించారు. వెంటనే విజయనిర్మల ఆశ్చర్యపోతూ హీరో కృష్ణ చేయి పట్టుకుని ‘నేను నటించాలట.. మీరేమంటారు. మీకు సరేనంటే బొటనవేలు పైకెత్తండి’ అని అన్నారు. వెంటనే కృష్ణ ఎడమచేతి బొటనవేలు పైకి ఎత్తి ‘ఎస్‌’ అని అనడంతో అంతా నవ్వులు వినిపించాయి. కృష్ణ అంగీకరించిన వెంటనే విజయనిర్మల ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ప్రకటించారు.

loader