అందాల రాక్షసి చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా ఎమోషనల్ ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన ఫలితం దక్కలేదు. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నవీన్ ప్రయత్నించాడు. ఆ చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి. ఇక గత ఏడాది విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేత.. నవీన్ చంద్ర కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేలా చేసిందనడంలో సందేహం లేదు. 

ఈ చిత్రంలో నవీన్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. ఇక ఇటీవల విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'ఎవరు' చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ దూసుకుపోతున్నాడు. ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా నటిస్తుండడంతో నవీన్ పై దర్శకుల దృష్టి పడింది. ప్రస్తుతం నవీన్ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నవీన్ నటిస్తుండగా, మరికొన్ని ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. 

నవీన్ చంద్ర ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నరేంద్రనాధ్ దర్శకుడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రియుడిగా నవీన్ కనిపిస్తాడట. ఇక కాజల్ అగర్వాల్, మంచు విష్ణు నటించే ఓ త్రిభాషా చిత్రంలో కూడా నవీన్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో నవీన్ పాత్ర కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. 2800 కోట్ల స్కామ్ నేపథ్యంలో జెఫ్రీ చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.