పవన్‌ కళ్యాణ్ బర్త్ డే ఓ వైపు టాలీవుడ్‌, మరోవైపు ట్విట్టర్‌ ఇండియాని షేక్‌ చేస్తుంది. ఓ వైపు సెలబ్రిటీల అభినందనలు, ఫ్యాన్స్ హడావుడి, మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లతో బుధవారం మొత్తం సందడి సందడిగా మారింది. అనేక సినిమాలు పవర్‌స్టార్‌ బర్త్ డేని పురస్కరించుకుని తమ సినిమాల పోస్టర్లని, అప్‌డేట్‌ని ప్రకటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. 

ఇక సెలబ్రిటీలు తమ దైన స్టయిల్‌లో పవన్‌కి బర్త్ డే విశెష్‌ తెలియజేస్తున్నారు. వారిలో నేచురల్‌ స్టార్‌ నాని చెప్పిన విశెష్‌ హైలైట్‌గా నిలిచింది. ఆయన ట్వీట్‌ చేస్తూ, `హ్యాపీ బర్త్ డే పవన్‌ కళ్యాణ్‌ సర్. మీరు `వకీల్‌ సాబ్‌` ఎంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని సందేశం చాలా ముఖ్యమైనది. ఈ సందేశాన్ని అందరి హృదయాలకు, మనసుకు తీసుకెళ్ళడానికి మీరే సరైన వ్యక్తి. అందుకు థ్యాంక్స్` అని తెలిపారు.  దీనికి విశేష స్పందన లభిస్తుంది. 

`వకీల్‌ సాబ్‌` హిందీలో రూపొందిన `పింక్‌` చిత్రానికి రీమేక్‌. ఇది ఇప్పటికే తమిళంలో రీమేక్‌ అయి ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ అవుతుంది. దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ని నేడు విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నాని నటించిన `వి` చిత్రం ఈ నెల 5న ఓటీటీలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.