నేషనల్ ఫిల్మ్ అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడు వన్‌రాజ్‌ భాటియా ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆర్ట్ సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన వన్‌రాజ్‌ ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందిపడుతున్నారు.

గోవింద్‌ నిహ్లాని తమస్‌ చిత్రానికి గాను మ్యూజిక్ కంపోజర్‌ వన్‌రాజ్‌ భాటియాకు 1988లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు లభించగా, 2012లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు లభించింది. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులో రోజువారీ ఖర్చులకు డబ్బులేక దయనీయ స్థితిలో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. 

తాను జ్ఞాపకశక్తిని కోల్పోతున్నానని, మోకాళ్ల నొప్పులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. ఇప్పుడు తన బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేదని వెల్లడించారు. పనిమనిషి సేవలపై ఆధారపడి బతుకుతున్నట్లు.. రోజువారీ ఖర్చుల కోసం విదేశాల నుంచి తెప్పించుకున్న వంట సామాగ్రిని అమ్ముకునేందుకు సిద్ధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులేక తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వెల్లడించలేనని చెప్పారు. మరి ఈయన పరిస్థితి తెలుసుకున్న బాలీవుడ్ స్టార్లు ఏదైనా సహాయం చేస్తారేమో చూడాలి!