నటుడు నాజర్ ఇంట్లో విషాదం..
ప్రముఖ విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తండ్రి కన్నుమూశారు. తాజాగా విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. 95 వయసున్న నాజర్ తండ్రి మెహబూబ్ బాషా మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని చెంగల్పట్టులో గల తన నివాసంలో ఆయన ప్రాణాలు వదిలారు. ఆ విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తండ్రి మరణంతో నాజర్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు. ఈ సందర్భంగా నాజర్‌కి సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన తండ్రి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారని తెలుస్తుంది.
నాజర్ గత నాలభై ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నారు. హీరోగా నుంచి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వందల చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలు కూడా చేశారు. 1985లో కె బాలచందర్ రూపొందించిన `కల్యాణ అగథిగల్` చిత్రంతో నటుడిగా మారారు. ఈ చిత్రంలో సహాయ నటుడిగా మెప్పించారు. బలమైన పాత్రలకు ఆయన కేరాఫ్‌గా నిలుస్తారు. ఇటీవల వచ్చిన `800`, `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రాలతోపాటు `పోకిరి`, `బాహుబలి`, `భగీరథ`, `చంటి`, `అదుర్స్` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ తెలుగులో బిజీగా ఉన్నారు.