ఛలో చిత్రంతో హిట్ కొట్టి మంచి జోష్ మీదున్న యంగ్ హీరో నాగ‌శౌర్య‌ నటిస్తున్న మరో కొత్త చిత్రం నర్తనశాల షూటింగ్‌ను ఇటలీలో ప్రారంభించారు. ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. నర్తనశాల చిత్రం ద్వారా మరో కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి తెలుగు తెరకు పరిచయం కానున్నాడు.

సినిమా టైటిల్ చూసి ఇదేదో మహానటిలా బయోపిక్ మాదిరిగానో లేకా క్లాసిక్ మూవీలానో ఉంటుందని అనుకోకండి. ఇది పూర్తి వినోదాత్మక చిత్రంలా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలో మూవీ పోస్టర్ రిలీజ్ రోజే క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఇటలీలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నర్తనశాల సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఈ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. నాగశౌర్య స్వంత బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.