హీరోగా అకేరీర్ ఆరభించినప్పటి నుండి వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నారా రోహిత్. 'బాణం', 'సోలో', 'ప్రతినిధి', అసుర' ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు. ఒకానొక దశలో పది సినిమాలు లైన్ లో పెట్టి హాట్ టాపిక్ గా మారాడు.

రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయాడు. అయితే వరుస ఫ్లాప్ లు నారా రోహిత్ ని చుట్టుముట్టాయి. దీంతో అతడి మార్కెట్ దెబ్బతింది. గత రెండేళ్లలో  ఐదారు ఫ్లాప్ లు పడడంతో డీలా పడ్డాడు. చివరగా ఆయన నటించిన 'వీర భోగ వసంత రాయలు' సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఖాళీ లేకుండా సినిమాలు చేసిన రోహిత్ ఎన్నడూ లేని విధంగా ఖాళీగా ఉండిపోయాడు. దాదాపు పది నెలలుగా అతడి నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఏదైనా సినిమా చేస్తున్నాడా..? అంటే అదీ లేదు. 'బాణం' దర్శకుడితో 'అనగనగా దక్షిణాది' అనే సినిమా అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా కాస్త ఆగిపోయింది. 'శబ్దం' అనే మరో సినిమా కూడా అనుకున్నారు.

ఆ సినిమా ఊసే లేదు. ఇటీవల 'బ్రోచేవారెవరురా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు రోహిత్. ఈ ఈవెంట్ లో నారా రోహిత్ ని చూసిన వారంతా షాకవుతున్నారు. ఫిజిక్ మైంటైన్ చేయకుండా.. గడ్డం పెంచేసి ఓ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. నారా రోహిత్ పరిస్థితి చూస్తుంటే.. ఇప్పట్లో ఈ హీరో తెలుగు సినిమాల్లో కనిపించేలా లేడు!