2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ గురించి  ఆసక్తికర చర్చ జరుగుతోంది. టిడిపి నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని డిమాండ్ తరచుగా వినిపిస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం తన సినిమా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చేసిన వ్యాఖ్యలు చిన్నపాటి కలకలాన్నే సృష్టించాయి. టిడిపికి ఎన్టీఆర్ అవసరం లేదని, తమ పార్టీలో చాలా మంది యువ నాయకులు ఉన్నారని భరత్ కామెంట్స్ చేశారు. దీనితో భరత్ పై జూ.ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజాగా ఈ విషయంలో క్లారిటీ కోసం మీడియా నారా లోకేష్ ని ప్రశ్నించింది. లోకేష్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు. జూ.ఎన్టీఆర్ పార్టీలోకి వస్తున్నారా.. ఆయనని కలుపుకుని పోతారా అని ప్రశ్నించగా.. అది ఎన్టీఆర్ వ్యక్తిగత నిర్ణయం అని నారా లోకేష్ స్పందించాడు. తెలుగు దేశం పార్టీ ఏ ఒక్క వ్యక్తిదో కాదని అందరిది అని లోకేష్ తెలిపాడు. 

తెలుగు దేశం పార్టీ కోసం ఎవరైనా పనిచేయొచ్చు.. పార్టీని బలపరచవచ్చు అని తెలిపాడు. తెలుగు దేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చిన ఎవరైనా పార్టీలో చేరవచ్చు అని లోకేష్ తెలిపాడు. 2009 ఎన్నికల్లో భాగంగా జూ.ఎన్టీఆర్ టిడిపి తరుపున ప్రచారం చేశాడు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.