మెగాస్టార్ చిరంజీవి నేడు 64వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి అభిమానుల నుంచి, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరు నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి త్వరలో విడుదల కానుండడంతో పుట్టినరోజు సంబరాల్లో మరింత జోష్ కనిపిస్తోంది. 

తాజాగా టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని చిరంజీవి గారు పదిలం చేసుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అని ఆయన నిరూపించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

చంద్రబాబు కూడా చిరంజీవికి బర్త్ డే విషెష్ తెలిపిన సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాత.