యాక్టర్ గానే కాకుండా చిలసౌ సినిమాతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ సెకండ్ స్టెప్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. అక్కినేని నాగార్జున తో చేసిన మన్మథుడు 2 ఉహించినంతగా సక్సెస్ కాలేదు. రెండవరోజు కలెక్షన్స్ కూడా ఒక్కసారిగా తగ్గాయి. అయితే రాహుల్ కి చిలసౌ సినిమా చేసిన తరువాత చాలా మంది నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి. 

అందులో నిర్మాత నాగవంశీ కొరికే మేరకు సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో చేయడానికి రాహుల్ ఒప్పుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే రాహుల్ నెక్స్ట్ సినిమా నానితోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సితారా బ్యానర్ లో నాని జెర్సీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరో సినిమా కూడా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు. నాని కోసం దర్శకులను వెతుకుతున్న నిర్మాత నాగవంశీ నానిని డైరెక్ట్ చేసే అవకాశం రాహుల్ కి ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. 

అయితే మన్మథుడు 2 ప్లాప్ కావడంతో నాని రాహుల్ తో వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది సందేహంగా ఉంది. ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న V సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే గ్యాంగ్ లీడర్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పనులను నాని పూర్తి చేశాడు. V సినిమా తరువాత నాని సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయనున్నాడు.