కరోనా సమయంలో నేచురల్‌ స్టార్‌ నాని నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. కానీ ఇప్పుడు మరో సినిమాని ఓటీటీలోని రిలీజ్‌ చేయబోతున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. `వీ`, `టక్‌ జగదీష్‌` చిత్రాలు ఓటీటీలో విడుదలై నిరాశ పరిచాయి. ఈ రెండు సినిమాలు కరోనా సమయంలో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో నాని సినిమా ఓటీటీలో రాబోతుంది. థియేటర్లు పూర్తి స్థాయిలో రన్‌ అవుతూ, యదావిథంగా అన్ని రన్‌ అవుతున్న సమయంలో నాని సినిమా ఓటీటీలో రావడం ఏంటనేది డౌట్‌ రావచ్చు. అయితే ఆయన నిర్మించిన చిత్రాన్ని నాని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. 

నాని `వాల్‌ పోస్టర్‌ సినిమా` బ్యానర్‌పై కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రాలను నిర్మిస్తున్నారు. `అ!`, `హిట్‌` వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `హిట్‌ 2`తోపాటు `మీట్‌ క్యూట్‌` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో `మీట్‌ క్యూట్‌`ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. సోనీలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఐదు కథల ఆంథాలజీగా రూపొందిన ఈసినిమాతో నాని సిస్టర్‌ దీప్తి ఘంటా దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు.

ఇందులో సత్యరాజ్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, రోహిణి మోలెటి, ఆదాశర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్‌, రుహాని శర్మ, సునైనా, సంచితా పునాచ ఫీమేల్‌ లీడ్‌ కాగా, అశ్విన్‌ కుమార్‌, శివ కందుకూరి, దీక్షిత్‌ శెట్టి, గోవింద్‌ పద్మసూర్యా, రాజా మేల్‌ లీడ్‌ చేస్తున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే ఐదు కథలతో సాగే ఈ చిత్రం ఆడియెన్స్ కి ఓ కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుందని చెబుతుంది యూనిట్‌. రేపు (నవంబర్‌ 12) ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతుంది. త్వరలోనే సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు. 

ఇక `శ్యామ్‌ సింగరాయ్‌`తో హిట్‌ని అందుకున్న నాని ఇప్పుడు `దసరా` చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తి మాస్‌ రా మూవీ. తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. కోల్‌ మైనింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో నాని ఊరమాస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట విడుదలకాగా, అది ట్రెండ్‌ అయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.