నాని ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ రివ్యూ రేటింగ్

First Published 21, Dec 2017, 3:01 PM IST
nani mca middle class abbayi movie review
Highlights
  • చిత్రం: ఎంసిఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)
  • నటీనటులు: నాని, సాయి పల్లవి, భూమిక, విజయ్ వర్మ, రాజీవ్ కనకాల తదితరులు
  • సంగీతం: దేవిశ్రీప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
  • నిర్మాత: దిల్ రాజు
  • దర్శకత్వం: వేణుశ్రీరామ్
  • ఆసియానెట్ రేటింగ్-3.25/5

కథ-

నాని(నాని) చదువు పూర్తయినా ఉద్యోగం రాక ఇంట్లోని వుంటుంటాడు. తనకు చాలా టాలెంట్ వున్నా... ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకపోవడంతో... ఇంట్లో నానా పనులు చెప్పి దారిలో పెట్టాలనుకుంటుంది వదిన జ్యోతి(భూమిక). పెళ్లయిన కొద్ది కాలానికే జ్యోతికి ఉద్యోగరీత్యా వరంగల్ కు ట్రాన్స్ ఫర్ కావటం, తన భర్త రాజీవ్ కనకాలకు దిల్లీలో ఉద్యోగం రావటంతో.. తనతో పాటే నానిని వరంగల్ కు తీసుకెళ్తుంది వదిన జ్యోతి. అక్కడే ఇంజనీరింగ్ చదువుతూ వుంటుంది పల్లవి(సాయిపల్లవి). నానికి బంధువైన పల్లవి.. అతనితో తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం బాధ్యతతో నిర్వరిస్తున్న క్రమంలో... వరంగల్ లో పేరుమోసిన ట్రావెల్ సంస్థ యజమాని శివ అలియాస్ శివన్నకు చెందిన బస్సుల్ని సీజ్ చేయిస్తుంది. చిన్నతనంలోనే గెలవటం కోసం క్రికెట్ ఆటలో స్నేహితున్ని చంపి జువైనల్ బోర్డులో పెరిగిన శివ మంచి మనిషిగా మారాలని కోరుకుంటుంది తల్లి. బస్సు సీజ్ చేసిన జ్యోతి కార్యాలయానికి శివన్న వెళ్లి పాయింట్ బ్లాంక్ ఎక్కుపెట్టడంతో.. నాని అక్కడికి  రావటం.. వదినను కాపాడుకోవటం జరుగుతుంది. అయితే.. నానిపై., అతని వదినపై పగబట్టిన శివన్న ఎలాగైనా జ్యోతిని చంపి తాను గెలవాలని భావిస్తాడు. మరి వదినను నాని ఎలా కాపాడుకున్నాడు.. శివన్నను ఎలా అంతమొందించాడు అన్నదే మిగతా కథ.

 

విశ్లేషణ-

కుటుంబ కథా చిత్రాలను సహజ శైలితో తెరకెక్కిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనటానికి మరో ఉదాహరణగా ఎంసీఏ నిలుస్తుందనటంతో ఎలాంటి సందేహం లేదు. అన్నా వదినల మధ్య బంధాన్ని మూల కథగా తీసుకుని తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య కాలంలో లేవు. అందుకే కథ మన ఇంట్లోనో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. మధ్య తరగతి మనస్తత్వాలు ఎలా వుంటాయి.. సమస్య రాకముందే ఎంతగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారో అంటూ.. కొన్ని మధ్య తరగతిని ఆకట్టుకునే డైలాగులు సహజంగా వున్నా.. మనసుకు హత్తుకుంటాయి. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంసీఏను కథకు తగ్గట్టుగా.. ఎక్కువ నాన్ సెన్స్ క్రియేట్ చేయకుండా... సున్నితంగా.. చాలా పక్కాగా.. తెరపై ఆవిష్కరించటంలో సక్సెస్ అయ్యాడు. దేవీశ్రీ సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దేవీ మ్యూజిక్ కు సాయిపల్లవి తన స్టెప్పులతో డాన్సుల్లో నానిని సైతం ఓవర్ టేక్ చేసింది. అయితే తనదైన సహజ నటనతో నాని సాయిపల్లవిని డామినేట్ చేసినట్లే అనిపించినా..మళ్లీ సాయి పల్లవి బాగా చేసిందా అనిపిస్తుంది.. కానీ నానీ తన నేచురల్ పర్ఫామెన్స్ ఇచ్చాడనిపిస్తుంది.

ప్రేమ కథలు,కుటుంబ కథా చిత్రాల్లో నేచురల్ గా నటించి ఆకట్టుకోవటం నానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీలోనూ నాని తనదైన నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి ఫిదాను మించి ఈ మూవీలో తన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఎంసీఏలో సాయిపల్లవి యువతను కట్టిపడేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. డాన్సుల్లోనూ సాయి పల్లవి తనేంటో మరోసారి నిరూపించుకుంది. ఇక భూమిక వదిన పాత్రలో నటించినా... ఉద్యోగ రీత్యా తను ప్రదర్శించాల్సిన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ఆ కేరక్టరుకు ఉండాల్సిన అన్ని కోణాల్లోనూ తనదైన శైలిని ప్రదర్శించింది. ఈ పాత్రకు భూమిక తప్ప మరెవరూ సెట్ అయ్యేవారు కాదేమో అనిపించేలా నటించింది. పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు నరేష్, ఆమని తదితరులంతా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విలన్ రోల్ పోషించిన విజయ్ వర్మ గురించి. శివన్న పాత్రలో విజయ్ వర్మ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇలా కేరక్టర్ కు తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకోవటంలో దర్శకుడు పర్ ఫెక్ట్ గా వ్యవహరించాడు. సహజమైన కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు వరకు పక్కా టైమింగ్ తో తెరకెక్కించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది.

 

చివరగా-

సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఎన్ని లాజిక్ లు ఆలోచించినా... మిస్టేక్స్ కనిపించక.. ఫ్యామిలీలకు నచ్చేలా వున్న ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి

loader